ఏం కొనేటట్లు లేదు

by  |
ఏం కొనేటట్లు లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలతో కూరగాయల పంటలు నీట మునిగాయి. దిగుబడి తగ్గిపోయింది. చేతికందాల్సిన పంట నీటిపాలైంది. అవసరాలకు తగినంత సప్లయ్ లేకపోవడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడింది. దళారులు దీన్ని అవకాశంగా మల్చుకున్నారు. ధరలను పెంచేశారు. సామాన్యులపై భారం పడింది. వారం రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండడంతో అక్కడి పంటలు కూడా దెబ్బతిన్నాయి. జాతీయ రహదారులు వరద నీటికి కొట్టుకుపోవడంతో చాలా ట్రక్కులు హైదరాబాద్ రావడానికి జంకుతున్నారు. ఏక కాలంలో అన్ని వైపుల నుంచీ ఇబ్బందులు తలెత్తడంతో ధరలకు రెక్కలొచ్చాయి.

నాలుగు రోజుల్లోనే తారుమారు..

వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వారం రోజుల వానలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. హైదరాబాద్‌ రైతు బజార్లతో పాటు గుడిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి మార్కెట్లలోనూ ధరలు మండిపోతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో వర్షాల కారణంగా సుమారు 97 వేల ఎకరాల్లోని కూరగాయల పంటల్లో దాదాపు 65% మేర వర్షానికి దెబ్బతిన్నట్లు ఉద్యానవన శాఖ అధికారుల అంచనా. ఈ కారణంగా నగరానికి రావాల్సిన కూరగాయలు రావడంలేదు. ఫలితంగా కొరత ఏర్పడింది.

ఈ నెల ప్రారంభంలో కిలో టమాట ధర రూ.16 ఉంటే ఇప్పుడది రూ. 40-60 మధ్య ఉంది. చిల్లర దుకాణాల్లో, సూపర్ మార్కెట్లలో రూ.70 దాకా ఉంది. వంకాయ కిలో రూ.35 నుంచి రూ.50కు చేరింది. రైతు బజార్లలో బెండకాయ కిలో రూ. 60 ఉంటే లోకల్‌ మార్కెట్లలో ఐదు రూపాయలు ఎక్కువే ఉంది. చిక్కుడు, కాకరకాయ కిలో 75 రూపాయలు ఉన్నాయి. పచ్చిమిర్చి కిలో రూ.65 నుంచి రూ.70 పలుకుతోంది. దాదాపు కూరగాయల ధరలన్నీ కిలో రూ.50కు పైనే ఉన్నాయి. వర్షాలతో ఆకుకూరల తోటలు కొట్టుకుపోవడంతో పాలకూర, కొత్తిమీర రేట్లు కూడా పెరిగాయి. మరోవైపు ఉల్లి దిగుమతులు తగ్గడంతో ప్రస్తుతం రైతు బజార్లలోనే రూ.50 పైన విక్రయిస్తున్నారు. మార్కెట్ లో రూ.70-100 వరకూ అమ్ముతున్నారు.

అవసరానికి సరిపడ దిగుబడి లేక..

ఆదిలాబాద్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌, మహేశ్వరంతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్‌ మార్కెట్‌కు టమాటా వస్తుంది. ఈ మధ్య రావడం లేదు. నిత్యం మనం 21 రకాల కూరగాయలు వినియోగిస్తుంటే అందులో 16 రకాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవే. వర్షాలతో అవి కూడా ఆగిపోయాయి. రాష్ట్రంలో నెలకు 3 లక్షల మెట్రిక్‌ టన్నులు కూరగాయలు వినియోగం ఉంటుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. వర్షాల కారణంగా లక్షన్నర నుంచి 2 లక్షల టన్నుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వరదల్లో తోటలు కొట్టుకుపోవడంతో ఒక్కసారిగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.

దిగుమతి కూడా అంతంతే..

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేటతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచే హైదరాబాద్ నగరానికి అధికంగా కూరగాయలు వస్తుంటాయి. వీటితోపాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా, క్యాప్సికం, ఆలు, పచ్చి మిర్చి ఉత్పత్తుల దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. వారం క్రితం దాదాపు 150 లారీల మేర టమాటాలు వస్తే ప్రస్తుతం 50-60 లారీలే వస్తున్నాయి. మోండా మార్కెట్, ఎల్బీనగర్, గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి వంటి ప్రధాన కూరగాయల మార్కెట్లతోపాటు రైతు బజారజార్లకు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.

మరింత ముప్పు..

ధరలు పెరగడానికి భారీ వర్షాలే కారణం. కుండపోత వానలకు కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉత్పత్తితో పాటు దిగుమతులు పడిపోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు రైతు బజార్లతోపాటు లోకల్ మార్కెట్లలో వ్యాపారులు ధరలు మరింత పెంచారు. ప్రస్తుతం మార్కెట్లో కొద్దిమేరకు పెరిగినా వచ్చే రోజుల్లో మరింత ప్రమాదకర స్థాయిలో ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. వరదలతో కూరగాయల పంటలు మొత్తం కొట్టుకుపోగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణమ్మ తీరంలో సాగు మొత్తం పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి దిగుబడి తగ్గిపోతోంది. ఇది మరింతగా పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.



Next Story

Most Viewed