‘పీఆర్సీ వెంటనే అమలు చేయాలి’

by  |
‘పీఆర్సీ వెంటనే అమలు చేయాలి’
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిలగాని సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. పీఆర్సీకి సంబంధించి రోజుకో రకంగా మీడియాలో వస్తున్న వార్తలతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొందన్నారు.

సత్వరమే పీఆర్సీ అమలు, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ 23న హైదరాబాద్ ధర్నా చౌక్ లో ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టాలని, అదేరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మండల కేంద్రాలు, విద్యాసంస్థల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు .అప్పటికీ సమస్యల పరిష్కారం కాకుంటే ఫిబ్రవరి 15 లోపు రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను కదిలించి ప్రత్యక్ష కార్యాచరణను చేపట్టాలని సమావేశం నిర్ణయించిందని సంపత్ కుమార స్వామి వెల్లడించారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు సదానందం గౌడ్, కె జంగయ్య, పి కృష్ణమూర్తి, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్ రెడ్డి, చావ రవి, ఎం రాధాకృష్ణ, డీవీ రావు, వీ శ్రీను నాయక్, ఎన్ యాదగిరి, టీ విజయసాగర్, జీ నిర్మల, నగేష్ యాదవ్, ఖమ్రొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed