జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పత్తాలేని అగ్నిమాపక చర్యలు..

by  |
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పత్తాలేని అగ్నిమాపక చర్యలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియాలో ఫైర్ సేఫ్టీ లేకుండా పోయింది. వ్యాపార భవనాలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఫంక్షహాళ్లు ఇలా అన్నింట్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించే.., నోటీసులు ఇచ్చే సంస్థే అగ్నిపై నిర్లక్ష్యం వహించడం విమర్శలకు తావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన ప్రజాసేవల విభాగమే ఇలా ఉండడంతో ప్రైవేట్ వ్యక్తులు కూడా అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. నగర మేయర్, డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్లు, ఇతర విభాగాల ప్రధాన అధికారులు ఈ కార్యాలయం కేంద్రంగా పని చేస్తుంటారు. అధికారులు, సిబ్బందితో సహా సుమారు రెండు వేల మంది వరకూ పని చేసే ఈ కార్యాలయానికి నిత్యం వందల మంది సాధారణ ప్రజలు, ఇతర శాఖల అధికారులు కూడా వస్తుంటారు. ఇంత ప్రాధాన్యత కలిగిన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని అగ్నిమాపక వ్యవస్థ పని చేయడం లేదు. దేశంలో పలు చోట్ల అగ్రిప్రమాదాలు జరిగినప్పుడు జీహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ శాఖలు కొన్ని రోజుల పాటు హడావుడి చేయడం పరిపాటిగా మారింది. గత మూడేళ్లలో సూరత్‌లోని ఓ స్కూల్‌లో, బాంబేలోని పబ్‌లోనూ ప్రమాదం జరిగినప్పుడు, ఎల్‌బీనగర్‌లోని ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నప్పుడు మాత్రమే బల్దియా అధికారులు వారం పాటు నోటీసులు జారీ చేయడం, యాజమాన్యాల నుంచి రిపోర్టులు తెప్పించుకుంది. ఆ తర్వాత అంతా మామూలుగా మారిపోవడం కనిపించాయి.

అంతా నిర్లక్ష్యమే..

లిబర్టీ సర్కిల్ దగ్గరలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం జీ+7 అంతస్తులతో నిర్మించి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో సిటిజన్ సర్వీస్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్‌లో కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్ చాంబర్‌లు ఉన్నాయి. మేయర్‌కు ఏడో అంతస్తులోనూ మరో కార్యాలయం ఉంటుంది. అదే అంతస్తులో ప్రస్తుతం ఎన్నికల మానిటరింగ్ రూం నిర్వహిస్తున్నారు. వరదల సమయంలో, ఇతర సందర్భాల్లోనూ ఇక్కడి నుంచే మానిటరింగ్ చేస్తారు. ఇక మిగిలిన అంతస్తుల్లో జీహెచ్ఎంసీ ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. నగర ప్రముఖులు, రాజకీయ, సామాజిక నాయకులు, ప్రజలు, అధికారులు వివిధ పనుల కోసం ఈ కార్యాలయాలకు నిత్యం వస్తుంటారు. అయితే భవనంలోని ఏ అంతస్తులోనూ ఫైర్ సేఫ్టే వ్యవస్థ పనిచేయడం లేదు. భవనం పైన పెద్ద నీటి ట్యాంకును ఏర్పాటు చేసినప్పటికీ, దాని నుంచి నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్‌ను భవనం మరమ్మతుల కోసం చాలా నెలల క్రితమే తొలగించారు. పనులు పూర్తయినా.. ఆ వ్యవస్థను పునరుద్ధరించలేదు. ఆయా అంతస్తుల్లో నీటిని అందించాల్సిన ఫైర్ పైప్ లైన్లు కూడా సరిగా లేవు.

డబ్బుల కోసం పైప్‌లైన్ వ్యవస్థ ధ్వంసం

ప్రమాదం జరిగినప్పుడు వాటర్ లైన్లకు కనెక్షన్ ఇచ్చేందుకు పక్కనే రబ్బరు పైపును నిల్వ చేసే బాక్స్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భవనంలోని ఫైర్ వాటర్ లైన్ల పైపులన్నీ తుప్పుపట్టిపోయాయి. నీటి సరఫరా చేసే పైప్ లైన్ మొదటి భాగంలోని కప్లింగ్, రబ్బరు తొడిగే భాగం బరువైన కంచుతో తయారు చేసి ఉంటుంది. మార్కెట్‌లో మంచి విలువ కలిగి ఉండటంతో వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసి సొమ్ము చేసుకున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏ అంతస్తులోనూ ఈ వెండి పైప్ భాగాలు లేనేలేవు. అనుకోని ప్రమాదం ఏ అంతస్తులో జరిగినా విలువైన ఫైళ్లు, ఆస్తులు అగ్నికి ఆహుతి అవ్వాల్సిందే తప్ప కాపాడుకునే ఛాన్స్ లేదు. ప్రధాన కార్యాలయంలోనే దొంగలు పడి ఫైర్ సేఫ్టీ వ్యవస్థలోని విలువైన పైపులను అమ్ముకున్నా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇంటి దొంగల పనే అని అందరికీ తెలిసినా వారిని శిక్షించేందుకు సాహసం చేయలేకపోతున్నారు. అయితే వేల మంది ప్రాణాలను, ఆస్తులను అగ్నికి బలిచ్చే ఇలాంటి పనులపై బల్దియా నిర్లక్ష్యంగా వహిస్తుండటం గమనార్హం.


Next Story

Most Viewed