ఇంటికి మరమ్మతులు చేసినా డబ్బు ఇవ్వాల్సిందే..

by  |
ఇంటికి మరమ్మతులు చేసినా డబ్బు ఇవ్వాల్సిందే..
X

దిశ, జవహార్‌నగర్: కార్పొరేషన్‌లో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ప్రణాళిక విభాగం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగం అనుమతులు ఇవ్వడంతో కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరుతుంది. కానీ, జవహార్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు కొంతమంది కార్పొరేటర్లు. కార్పొరేషన్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి అనధికారికంగా అనుమతులిస్తూ నిర్మాణాలదారుల నుంచి లక్షల్లో వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తూ నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత ఇంటికి మరమ్మతులు చేసినా సరే డబ్బు ముట్టజెప్పాల్సిందేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జవహార్‌నగర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు తప్పని సరి. అధికార యంత్రాంగం అధికారికంగా అనుమతులు ఇవ్వడంతో మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ కు ఆదాయం సమకూరుతుంది. ఆ నిధులను పట్టణాభివృద్ధికి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పాలక మండలి, కార్పొరేషన్ అధికారుల ప్రధాన విధి. కానీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహార్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం కార్పొరేటర్లే అనధికారికంగా అనుమతులిస్తూ, నిర్మాణాలదారుల నుంచి లక్షల్లో వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తూ వారి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత ఇంటికి మరమ్మతులు చేసినా, లేక కొత్త ఇల్లు నిర్మించుకోవాలన్నా జవహార్ నగర్ ప్రజలు ముందు కార్పొరేటర్లకు డబ్బు ఇవ్వాల్సిన దుస్థితి. జవహార్ నగర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ భూములే కారణమా…!

జవహార్ నగర్ లోని 5977 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినవి అంటూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూముల్లో మాజీ సైనికుల పేరుతో ప్లాట్లు విక్రయించడంతో జవహర్ నగర్ పట్టణం విస్తరించడం, కొందరు మాజీ సైనికులు ఈ భూములు తమ వే అంటూ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రభుత్వ పరంగా ఎలాంటి పరిష్కార చర్యలు చేపట్టకపోవడంతో జవహర్ నగర్ లో అన్ని విధాలుగా అభివృద్ధి కుంటుపడింది. దాదాపు ముప్పై ఏళ్లుగా క్రమక్రమంగా వంద కాలనీలతో గ్రామపంచాయతీ నుంచి కార్పొరేషన్ స్థాయికి చేరింది. గతంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి కృషితో 318 ఎకరాలను గ్రామ కంఠం గుర్తిస్తూ ప్రభుత్వం వన్ టు ప్రత్యేక జీవోలు జారీ చేసింది. అనంతరం అనేక పరిణామాలతో పంచాయతీ నుంచి కార్పొరేషన్ హోదా సాధించినా, అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధుల కేటాయింపులు జరగలేదు. కేవలం ఎన్నికల సమయంలో ఆకర్షించేందుకు మాత్రమే జోహార్ నగర్ అభివృద్ధిని తెరమీదికి తెస్తూ పబ్బం గడుపుతున్నారు. జోహార్ నగర్ నగర పాలక మండలి ఏర్పడి ఏడాది గడుస్తున్నా అభివృద్ధి దిశగా పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నెరవేరని మంత్రి హామీలు…

సాక్షాత్తు మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలోని జవహర్ నగర్ తన గుండెకాయగా పేర్కొంటూ ఎన్నికల వేళ పలు హామీలు ఇచ్చారు. అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని చెప్పి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ కనీస మౌలిక వసతులు కల్పించలేకపోయారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్రంలో అధికారం ఇటు పాలకమండలిలో పూర్తిస్థాయి ఆధిపత్యంతో పాలక మండలి ఏర్పడినా ఇలాంటి అభివృద్ధి జాడ కనిపించడం లేదు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 28 కార్పొరేటర్లలో దాదాపు 90% మంది కార్పొరేటర్లు తమ అనుచరులతో అనధికారికంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. కూలి పని చేసుకునే వారు నుంచి అన్ని వర్గాల వరకు కార్పొరేటర్లకు మామూళ్లు చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది. 60 గజాల లో పేదవాడు రేకులు వేసుకున్నా వేల రూపాయలు చెల్లించాల్సిందే. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణానికి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి..

కార్పొరేషన్ ఆదాయం పెంచడానికి నిర్మాణాల అనుమతులు ఇవ్వాలి. నిర్మాణాలకు అనుమతులు లేవంటూ నే విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అనుమతులు ఇచ్చి దళారుల జేబులు నింపకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాలి.

-ఏల్ల గోని అశోక్ గౌడ్ బిజెపి మాజీ అధ్యక్షుడు జవహర్ నగర్సి

సిబ్బంది ఇష్టానుసారం..బల్లి శ్రీనివాస్ గుప్తా

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో, సిబ్బందిని ఏ ప్రాతిపదికన ప్రైవేట్ ఉద్యోగులను నియమించారు. అనుభవం లేని ప్రైవేట్ ఉద్యోగులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ గారు దృష్టిసారించి తగు చర్యలు తీసుకోవాలి.

-బల్లి శ్రీనివాస్ గుప్తా .జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed