హైదరాబాద్‌లో 2 నెలల శిశువు విక్రయం

by  |
హైదరాబాద్‌లో 2 నెలల శిశువు విక్రయం
X

దిశ, హైదరాబాద్: నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి దగ్గర చెత్తకుండీలో పసికందును వదిలేసిన ఘటన జరిగి 24గంటలు గడవక ముందే నగరంలో మరో సంఘటన చోటు చేసుకుంది. శనివారం రెండు నెలల మగ శిశువును తల్లిదండ్రులు.. వరంగల్‌ జిల్లాకు చెందిన దంపతులకు విక్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శిశువు సిటీ దాటి వెళ్లకముందే పట్టుకొని తల్లి ఒడికి చేర్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజులరామారం బతుకమ్మబండ బస్తీకి చెందిన మదన్‌సింగ్, సరిత దంపతులకు 2నెలల శిశువు ఉన్నాడు. ఇదే క్రమంలో వరంగల్ జిల్లాలో ఉంటున్న ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో సరిత సోదరి శేషు ద్వారా బాలుడిని విక్రయంపై చర్చలు జరిగాయి. చివరకు సరిత భర్త మదన్‌సింగ్‌తో మాట్లాడి శిశువును రూ.22వేలకు ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి 11గంటల సమయంలో శిశువును ఇంటి గోడపై పెట్టారు. శిశువును సంచిలో ఉంచిన సరిత సోదరి శేషు, ఇంకో మహిళ కారులో సికింద్రాబాద్ మీదుగా వరంగల్‌కు పయనమయ్యారు. అయితే ఈ విషయం ఇరుగుపొరుగు వారికి తెలియడంతో మేడ్చల్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలోనే అలర్టైన జీడిమెట్ల పోలీసులు సికింద్రాబాద్‌‌లో శేషు‌తో పాటు మరో మహిళను పట్టుకొని శిశువును తల్లి ఒడికి చేర్చారు.

అయితే లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందుల వల్ల శిశువును విక్రయించారనే అనుమానం కలుగుతుండగా, మదన్‌సింగ్ మద్యానికి బానిస కావడం వల్లే శిశువును అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. శిశువు విక్రయంలో పసికందు తల్లి సరిత ప్రమేయం లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. తాగుడికి బానిస కావడంతో తనకు తెలియకుండా భర్తే బిడ్డను విక్రయించాడని సరిత పోలీసులకు తెలిపింది. డబ్బుల కోసం తనకు తెలియకుండా బిడ్డను విక్రయించిన తన భర్తతో కలిసి ఉండనని, కూలి పని చేసుకుని అయినా బిడ్డను పెంచుకుంటానని సరిత పోలీసులకు స్పష్టం చేసింది. శిశువును విక్రయించినవారిపైనా, డబ్బులతో కొనుక్కోడానికి సిద్ధపడినవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డిని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల సీఐ బాలరాజు విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.


Next Story

Most Viewed