తిరుమలపై జూన్‌‌లో క్లారిటీ?

by  |
తిరుమలపై జూన్‌‌లో క్లారిటీ?
X

కరోనా కారణంగా చరిత్రలో తొలిసారి తిరుమల తిరుపతి దేవస్థానం 50 రోజులు పైబడే మూతపడింది.
నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల వీధులు ప్రస్తుతం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం స్వామివారికి నిత్య కైంకర్యాలు మినహా మరే ఇతర పూజ కార్యక్రమాలు జరగడం లేదు. ఈ నేపపథ్యంలో శ్రీవారి ఆలయం తెరవడంపై జూన్‌లో ఓ క్లారిటీ వస్తుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలను జూన్ నెల ఆరంభం నుంచి పునఃప్రారంభించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. లాక్‌డౌన్ 4.0 ముగింపు తరువాత శ్రీవారి ఆలయం తెరవడంపై ఒక క్లారిటీ వస్తుందని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు నూతన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నారు.

దేవాలయాల ప్రవేశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలోగా, ముందస్తు ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలో టీటీడీ ఉంది. ఈ మేరకు ఈ నెల 28న టీటీడీ పాలక మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తొలుత టీటీడీ ఉద్యోగుల్ని గంటకు 500 మంది చొప్పున దర్శనాలకు అనుమతించాలని, ఆపై తిరుమల, తిరుపతిలోని స్థానికులకు 10 నుంచి 15 రోజుల పాటు స్వామి దర్శనం చేయించాలని అధికారులు భావిస్తున్నారు.

భౌతిక దూరం నిబంధన నేపథ్యలో తిరుమలలో రోజు మొత్తంలో 14 గంటల పాటు స్వామి దర్శనానికి సమయం ఉండగా, ఈ సమయంలో భక్తుల సంఖ్యను 7 వేలకు దాటనీయకుండా చూడాలని భావిస్తోంది. దర్శన టికెట్లు కేవలం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలన్న ప్రతిపాదన ఉంది. ఈ మేరకు స్లాట్ల విధానాన్ని కూడా అధికారులు సిద్ధం చేశారు. దర్శనం టికెట్లు ఉన్న వారిని మాత్రమే అలిపిరి నుంచి కొండపైకి అనుమతించనున్నారు. ప్రతి భక్తుడికీ అలిపిరి వద్దే థర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ చేయనున్నారు. ప్రతి భక్తుడు విధిగా మా‌స్క్‌‌లు, గ్లౌజులు ధరించాల్సి ఉంటుంది.

క్యూ కాంప్లెక్స్‌లలో ఉద్యోగుల నియామకం, వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓలు సమీక్ష నిర్వహించారు. ప్రయోగాత్మక ప్రతిపాదనలన్నింటినీ ఈ నెల 28న జరిగే పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం జూన్ 1 నుంచి దేవాలయాన్ని తెరువనున్నట్టు తెలుస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed