ఖరీదైన విడాకులు..?

by  |
ఖరీదైన విడాకులు..?
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ ముగియడంతో పాటు కాబోయే అధ్యక్షుడు కూడా ఎవరో తేలిపోయింది.వచ్చే ఏడాది జనవరిలో బైడెన్ పదవిని స్వీకరించనున్నారు. మరోవైపు, వైట్‌హౌజ్‌ను వీడిన మరుక్షణమే డొనాల్డ్‌ ట్రంప్‌కు విడాకులు ఇవ్వాలని మెలానియా ట్రంప్‌ డిసైడ్‌ అయినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే 15 ఏండ్ల పెండ్లి బంధానికి మెలానియా శుభం కార్డు వేయనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్‌ చెప్పారు. ట్రంప్‌, మెలానియా మధ్య అసలు భార్యాభర్తల బంధమే లేదని, అవసరం కోసం కలిసి బతికేస్తున్నారని ఒమరోసా తెలిపారంట. దీనిని డెయిలీ మెయిల్‌ వెల్లడించగా.. ఒకవేళ ట్రంప్‌కు విడాకులు ఇస్తే ఆమెకు దక్కే పరిహారంపై న్యాయ నిపుణులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం.

డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియాలు 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి 14 ఏళ్ల బారన్‌ ట్రంప్‌ అనే కుమారుడున్నాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 5 నెలల తర్వాత మెలానియా వైట్‌హౌస్‌కు వచ్చారు. తన కుమారుడు బారన్ చదువు మధ్యలో ఉండటంతోనే న్యూయార్క్ నుంచి వాషింగ్టన్‌కు రావడానికి ఆలస్యమైనట్లు మెలానియా అప్పట్లో చెప్పారు. కానీ, స్టెఫానీ వోల్కాఫ్ మాత్రం.. ట్రంప్ సంపదలో బారన్‌కు సమాన వాటా ఇవ్వాలని మెలానియా పట్టుబట్టారని, అందుకే ఆమె ఆలస్యంగా వచ్చారని పేర్కొన్నారు. రెండో భార్య మార్లా మాపుల్స్‌తోనూ ట్రంప్‌ది ఒప్పంద వివాహమేనని, దాని ప్రకారం ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి విషయాలను బయటపెట్టకూడదు.ఈ నేపథ్యంలో మెలానియాతో రహస్య ఒప్పందం ఉండే ఉంటుందని, అందుకే ఆమె ఈ పరిస్థితుల్లో కూడా బయటకు ఏమీ మాట్లాడడం లేదని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.గతంలో జరిగిన పలు ఘటనలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ట్రంప్‌కు మెలానియా మూడో భార్య. ఆమె నిజంగా విడాకులు ఆశిస్తే ట్రంప్‌ మాజీ భార్యల కంటే ఇప్పుడు మెలానియాకు చాలా ఎక్కువ మొత్తంలో భరణం అందబోతుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం డొనాల్డ్‌ ట్రంప్‌ సంపద 250 కోట్ల డాలర్లు. మొదటి భార్యకు 14 మిలియన్‌ డాలర్లతో పాటు కనెక్టికట్‌లో ఒక భవనం, న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్‌ కూడా దక్కాయి. రెండో భార్యకు 2మిలియన్‌ డాలర్లు భరణం కింద అందగా.. ఇప్పుడు మెలానియాకు మాత్రం వారిద్దరి కంటే ఎక్కువగా భరణం అందే అవకాశాలు ఉన్నాయి. న్యూమాన్ రాడ్ మేనేజింగ్ భాగస్వామి జాక్వెలిన్ న్యూమాన్ లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు మెలానియా విడాకులు తీసుకుంటే ఆమెకు ట్రంప్‌ ఆస్తి నుంచి 68 మిలియన్‌ డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో రూ.507 కోట్లకుపైగా అందనున్నాయి. వీరి కుమారుడు బారన్‌కు 14 ఏండ్లు కావడంతో మెలానియాకు దక్కే ప్రాథమిక కస్టోడియన్‌ హక్కులన్నీ బారన్‌కు కూడా దక్కుతాయి. దాంతో భారీ మొత్తంలో భరణంతో పాటు కుమారుడి సంక్షేమానికి కూడా ట్రంప్‌ ఆస్తి ఇవ్వాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ‘ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలానియా ట్రంప్’ రచయిత మేరీ జోర్డాన్ ప్రకారం.. ట్రంప్ తన మునుపటి వివాహాల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, బారన్‌కు అన్ని ప్రయోజనాలను పొందేలా మెలానియా చర్యలు తీసుకున్నది.

ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్ నుంచి విడాకులు తీసుకున్న అయన భార్య మెకెంజీ.. 38.3 బిలియన్‌ డాలర్స్‌ అనగా, భారత కరెన్సీలో రూ.2.62 లక్షల కోట్లను భరణం కింద అందుకున్నారు. అప్పట్లో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. అంతేకాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా న్యాయనిపుణులు దీనిని పేర్కొంటారు.


Next Story

Most Viewed