కేటీఆర్‌ను సీఎం చేయకపోతే కారుకు కష్టాలు తప్పేలా లేవా?

by  |
కేటీఆర్‌ను సీఎం చేయకపోతే కారుకు కష్టాలు తప్పేలా లేవా?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ రోజు ఒక పార్టీలోనున్న నాయకుడు రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని విధంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు రాజకీయ విలువలతో కూడిన నేతలు ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే చివరి వరకు అందులోనే ఉండేవారు. అయితే క్రమ క్రమంగా రాష్ట్రంలో జరిగే పరిణామాలకు అనుగుణంగా నాయకులు కండువాలు మార్చడం ఆలవాటుగా మారిపోయింది. ఆయా పార్టీల్లో క్రీయశీలకంగా పనిచేసే నేతలు అవకాశాల కోసం పార్టీలు మారడంతో ప్రజల్లో నాయకులకు విలువ లేదు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని రాజకీయ నేతలు అవలంభిస్తున్న తీరు కనిపిస్తోంది. మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారమున్న టీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున్న వలసలుండగా… ఇప్పుడు కేంద్రంలో అధికారమున్న బీజేపీ వైపు నేతల చూపు పడింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని అధికార పార్టీలో కోనసాగుతున్న కొంత మంది కారు పార్టీ నేతలు బీజేపీలో చేరాలనే ఉత్సహాంతో ఉన్నట్లు తెలుస్తోంది. సమయం, సందర్భం కోసం ఎదురుచూస్తున్నట్లు విస్తృతంగా జిల్లాలో చర్చసాగుతుంది. అందులో భాగంగానే ఆ నేతలు ప్రస్తుతం జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఇంచార్జీ అందుబాటులో ఉన్నప్పుడే ఆ నేతలు సభలు, సమావేశాలకు హాజరైతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

పార్టీ మారేందుకు పాత నేతలు సిద్దం…

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని అధికార పార్టీ నేతలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈవిభేదాలు బహిర్గతం చేయకుండా, పార్టీని బలహీనపర్చి బయటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు నేతలు ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం వద్ద సీనియర్ నాయకులకంటే వలస నేతలకే ప్రాధాన్యత ఉందనే భావనలో నేతలున్నారు. తమ ముందే జూనియర్ నేతలు పార్టీ కార్యక్రమాల్లో, అధిష్టానం సూచించే ఏ పనిలోనైనా వాళ్లకే సుముచిత స్ధానం కల్పిస్తున్నారనే ఆవేదనకు సీనియర్ నేతలు గురైతున్నారు. దీంతో మరోదారి చూసుకోక తప్పదనే ఆలోచనలో ఆ నేతలున్నట్లు సమాచారం. కాకపోతే సమయం కోసం వేచిచూసే దోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా గులాబీ కండువాను వదిలిపెట్టాల్సిందేనని సన్నిహితుల వద్ద ఆ నేతలు స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతుంది. ఏడాది క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణంలో 34 వార్డులుంటే 24 మందికి ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాదులకే టీఆర్ఎస్ బీఫాంలు ఇవ్వడంతో సీనియర్ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. అనేక మంది ఎ.చంద్రశేఖర్ రావు వెంట టీఆర్ఎస్ లో ఆనాడు చేరారు. ఆయన పార్టీని విడినప్పటికి ఆనాయకులు ఇప్పటికి టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. అలాంటి నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ మారేందుకు సిద్దమైతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో టీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదనే ఆలోచనలో ఆ పార్టీ నేతలే అంతర్మథనంలో పడ్డారు. సీఎం కేసీఆర్ తమ కుమారిడికి పట్టాభిషేకం చేస్తారనే వార్తలు ఉపందుకోవడంతో యువ నేతలు, కేటీఆర్ అనుచరులు మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావించారు. కానీ కేటీఆర్ ను సీఎం చేయకపోవడంతో అసంతృప్తి నేతలు కాషాయం వైపు చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అధికార పార్టీకి పట్టభద్రులు చుక్కలు చూపిస్తున్నారని ఆపార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. వీటిని గమనిస్తున్న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొంత మంది గులాబీ నేతలు కాషాయం పై మనస్సు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నట్లు ప్రచారం సాగుతుంది.

భగ్గుమంటున్న అంతర్గత విభేదాలు…

వికారాబాద్‌ నియోజవర్గంలోని మర్పల్లి, ధారూరు, వికారాబాద్, కోట్‌పల్లి, బంట్వారం, మోమిన్‌పేట మొత్తం కలిపి 6 మండలాలున్నాయి. ప్రతి మండలంలో పాత, కొత్త క్యాడర్ ఉంది. ఇరువురి క్యాడర్ను కలుపకపోవడంలో పార్టీ ఇంచార్జీ తేడా చేస్తున్నట్లు సమాచారం. అందుచేత అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ లో చేరిన క్యాడర్ను పార్టీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు కూడా పార్టీ మారేందుకు సిద్దమైతున్నారు. ఇటీవల కాలంలో పార్టీలో చేరి ప్రయోజనం పొందిన ప్రజాప్రతినిధులు సైతం కాషాయం వైపు అడుగులు వేసేందుకు సిద్దమైతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో స్ధానిక ఎమ్మెల్యే ఆనంద్ కు బీజేపీ షాకిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాండూరు నియోజవర్గంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. రానున్న శాసన సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున తాండూరు నుంచి ఎవరు టికెట్‌ దక్కించుకున్నా.. మరో నేత బీజేపీలో చేరడం ఖాయం. వీరిద్దరి మద్య సయోధ్య కుదర్చడానికి మంత్రి కేటీఆర్‌ చోరవ చూపిన ఫలితం కనిపించడం లేదు. దీంతో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయి కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఎన్నికలు దగ్గర పడేకొద్ది ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. తాండూరులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య సయోధ్య కుదరడం సాధ్యం కాని అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల్లో తాండూరు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డి పోటీ చేయగా.. రోహిత్‌రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. అయితే కాంగ్రెస్‌ నుంచి గెలిచిన రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో మహేందర్ రెడ్డి ప్రాధాన్యత తగ్గింది.

మొదటినుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగతూ తెలంగాణ ఉద్యమంలో జిల్లా తరఫున కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు శుభప్రద్‌పటేల్‌కు ఇప్పటి వరకు కూడా ఏ పదవీ దక్కలేదు. ప్రత్యేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనపై 63 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు సైతం వెళ్లారు. అయితే టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత కూడా శుభ్రపద్‌కు ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ఆయన గులాబీ పార్టీలో కొనసాగడం దండగ అనే అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది. ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్న బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారని సమాచారం. అయితే శుభప్రద్‌ మాత్రం మరికొంత సమయం వేచి చూడాలనే ధోరణిలో ఉన్నారని వినికిడి. వికారాబాద్‌ నియోజవకర్గంలో టీఆర్‌ఎస్‌ పైకి బలంగా కనిపిస్తున్నా.. పార్టీలోని సీనియర్లు, వలస నాయకుల మధ్య ఏర్పడిన దూరం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. బీజేపీలో ఉత్సాహం పెరుగుతుండటంతో అటు వైపు వెళ్లేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నాయకులు మంతనాలు జరుపుతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రభావం తప్పదు…

అధికార టీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రెండు వర్గాలుగా ఏర్పాడ్డాయి. దీంతో సీనియర్లు పార్టీ మారే ఆలోచనలో ఉండగా… మరికొందరూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా ప్రయోజనం లేదనే భావనలోనున్న నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీలోని నాయకుల్లో స్థిరత్వం లేకపోవడంతో ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ప్రచారంలో చురుకుగా పాల్గొనడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అంతర్గత వర్గ పోరు ప్రభావం ఉంటుందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.



Next Story