వాయిస్ ఛేంజ్.. బీజేపీపై టీఆర్ఎస్ ఎదురుదాడి

by  |
వాయిస్ ఛేంజ్.. బీజేపీపై టీఆర్ఎస్ ఎదురుదాడి
X

దిశ ప్ర‌తినిధి, వరంగ‌ల్: బీజేపీ అగ్ర‌ నాయ‌క‌త్వంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగుతున్నారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోకి చొచ్చుకు వ‌స్తున్న క‌మ‌ల‌ ద‌ళాన్ని నిల‌వ‌రించకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని భావించి మాటల తుటాలు పేల్చుతున్నారు. పార్టీ ఆలోచ‌న ఎలా ఉన్నా…త‌మ రాజ‌కీయ ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డే ప‌రిస్థితులున్న‌ప్పుడు ఇంకా ఊరుకుంటే లాభం లేద‌ని భావిస్తున్నారు. ఈక్ర‌మంలోనే గ‌తవారం నుంచి గులాబీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌లు తమ వాగ్దాటిని పెంచేశారు. గొంతు స‌వ‌రించుకుని మ‌రీ విమ‌ర్శ‌నాస్త్రాల‌ను, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతున్నారు. మాట‌కు మాట‌.. అన్న రీతిలో జ‌వాబిచ్చేస్తున్నారు. తాట‌తీస్తాం.. నాలుక కోస్తామంటూ వ్యాఖ్య‌నిస్తుండ‌టం గ‌మ‌నార్హం. భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి గురువారం చిట్యాల మండ‌ల కేంద్రంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని లేదంటే ప్రతిఘటన తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

కేసీఆర్ ఢిల్లీ టూర్ త‌ర్వాత సైలెంట్

వారం క్రితం వ‌ర‌కూ చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి కాస్త వెనుకాడారు. అడ‌పాద‌డ‌పా వివ‌ర‌ణ‌లకు, కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం మ‌ట్టుకే ప‌రిమిత‌మ‌య్యారు. దీనికంతంటికి కారణం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాను క‌లిసి వ‌చ్చాక మౌనం వహించడమే. ఆ త‌ర్వాత ఆయుష్మాన్ ‌భార‌త్ అమలు, కొనుగోలు కేంద్రాల ఎత్తివేత‌కు ఆదేశాలు వంటివి పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మొత్తంగా ఢిల్లీలో కేసీఆర్‌కు బీజేపీ హైకమాండ్‌కు ఏదో స‌యోధ్య కుదిరింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అంతేగాక హైద‌‌రాబాద్‌లోని డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్స‌వంలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్ర‌మంలో కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆందోళ‌న‌కారుల‌ను ఉద్దేశించి బీజేపీ, టీఆర్‌ఎస్ నేత‌లు అన్న‌ద‌మ్ముల్లా క‌ల‌సి ప‌నిచేయాల‌ని మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌నించ‌డంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో గంద‌రగోళానికి దారితీసింది. బీజేపీతో టీఆర్ఎస్ రాజీప‌డుతోందా అన్న సందేహాలు త‌లెత్త‌డంతో ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, విమ‌ర్శ‌ల‌కు ఏ త‌ర‌హాలో కౌంట‌ర్ ఇవ్వాలో అర్థం కాక ఎమ్మెల్యేలు త‌ల‌లు ప‌ట్టుకున్నారు.

ఫ్ర‌స్టేష‌న్‌లో గులాబీ ఎమ్మెల్యేలు

దుబ్బాక, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అనుహ్య ఫ‌లితాల‌ను సాధించిన బీజేపీ.. రాష్ట్రంలో పార్టీ విస్త‌ర‌ణ‌పై దృష్టి పెట్టింది. అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి త‌రుణ్‌ చుగ్ అన్ని జిల్లాల‌ను చుట్టేసి క్యాడ‌ర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. వచ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది మ‌న‌మేనంటూ కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. అలాగే పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నేత‌ల‌ను గుర్తించి తమ పార్టీలో చేరేలా ఆక‌ర్ష‌నీయ‌మైన వ‌రాలు, హామీలు ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ క్ర‌మంగా బ‌లం పెరుగుతోంది. ఇటీవ‌ల వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లాలో తూర్పు, ప‌శ్చిమ, భూపాల‌ప‌ల్లి, జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న రా జ‌కీయ ప‌రిణామాలు ఇందుకు నిద‌ర్శ‌నం.

ఎమ్మెల్యేల‌కు అత్యంత స‌న్నిహితులుగా మెదిలిన నేత‌లు పార్టీ మార‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప‌రిణామాన్ని జీర్ణించుకోలేని స‌ద‌రు ఎమ్మెల్యేలు ఫ్ర‌స్టేష‌న్‌కు గుర‌వుతున్నార‌ని వినికిడి. వ‌రంగ‌ల్‌లోని ఒక ఎమ్మెల్యే అయితే పార్టీ మారిన ప్ర‌ధాన అనుచ‌రుడిపై అత‌ని స‌న్నిహితుల వ‌ద్ద తిట్ల దండ‌కం వినిపించిన‌ట్లు స‌మాచారం. ఇక‌పై ఎదురుదాడే ల‌క్ష్యంగా ప‌నిచేసుకుంటూ వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అధిష్ఠానం ఆదేశాల‌ను ప‌ట్టించుకుంటే మ‌న ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని సొంత ఏజెండాతోనే బీజేపీని ఎదుర్కొవాల‌ని భావిస్తున్నారని స‌మాచారం. మ‌రోమారు జ‌నంలో ఉండాలంటే ఇక మనం మాట్లాడాక త‌ప్ప‌దు.. ఇప్పుడు నోర్ముసుకుని కూర్చుంటే ఆ త‌ర్వాత ఎత్త మొత్తుకున్నా లాభం ఉండ‌దంటూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు త‌మ స‌న్నిహితుల వ‌ద్ద మ‌నోగ‌తాన్ని వినిపిస్తున్నారంట‌.


Next Story

Most Viewed