ఇక్కడ ధర్నాలు.. అక్కడ దరఖాస్తులు..

by  |
ఇక్కడ ధర్నాలు.. అక్కడ దరఖాస్తులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్ మళ్లీ ఇప్పుడు ఢిల్లీ బాట పట్టింది. పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన ఎంపీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని ప్రకటించారు. బస్సు యాత్ర చేస్తామని పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు స్పష్టం చేశారు. కానీ పది రోజులైనా ఇవేవీ మొదలుకాలేదు. మరోవైపు కేంద్ర మంత్రులతో భేటీల కోసం రాష్ట్ర మంత్రులు హస్తిన బాట పట్టారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో చావుడప్పు, ధర్నా, నిరసన కార్యక్రమాలను చేపడుతూనే కేంద్ర మంత్రులతో మీటింగుల కోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నది. పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపిస్తూనే అదే కేంద్ర మంత్రితో మళ్లీ భేటీ కోసం ప్రయత్నిస్తున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెడుతూనే దరఖాస్తులు సమర్పిస్తున్నది.

కొనే బాధ్యత కేంద్రానిదే..

రానున్న యాసంగి సీజన్‌కు బియ్యం కొంటరా కొనరా అంటూ ముఖ్యమంత్రి సహా మంత్రులు, పార్టీ నేతలు హైదరాబాద్‌లో ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి ఒత్తిడి పెంచారు. ప్రస్తుతం చేతికొచ్చిన పంట రెడీగా ఉండి కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే వచ్చే సంవత్సరం యాసంగి కోసం టీఆర్ఎస్ ఎంపీలు అర్థం లేని నిరసనలు చేస్తున్నారంటూ విపక్షాల నుంచి భారీ స్థాయిలోనే విమర్శలు వచ్చాయి. చివరి గింజ వరకూ వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని, గతేడాదికంటే ఈసారి ఎక్కువగా ధాన్య సేకరణ జరుగుతూ ఉన్నదని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు.

ఇప్పుడు హఠాత్తుగా వానాకాలం పంటను కేంద్రం కొంటుందో లేదో తేల్చుకుంటామంటూ ఆరుగురు మంత్రుల బృందం ఢిల్లీలో మకాం వేసింది. నిన్నమొన్న విపక్షాలు చేసిన విమర్శలే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి తక్షణ టాస్కుగా మారాయి. యాసంగి సీజన్‌లో పారాబాయిల్డ్ రైస్ కొనేది లేదంటూ కేంద్రం స్పష్టం చేయడంతో రైతులు వరి వేయవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తూనే ఒక్క కిలో కూడా కొనబోమని, కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టబోమని స్పష్టం చేసింది. ఇంకోవైపు బియ్యాన్ని కొనే బాధ్యత కేంద్రానిదేనని, కొనుగోళ్ళపై కేంద్రాన్ని ఒప్పించేందుకు కేసీఆర్ ఆదేశాల మేరకే మరోసారి చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. ఒకవైపు ‘ఆలౌట్ వార్’ ప్రకటించి మళ్ళీ సంప్రదింపుల బాట పట్టడంలోని మర్మంపై రాజకీయంగా గుసగుసలు మొదలయ్యాయి.

అపాయింట్​మెంట్లపై స్పష్టత లేదు..

ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా పీయూష్ గోయల్‌తో ముందస్తుగా అపాయింట్‌మెంట్ ఫిక్స్ కాకుండానే కేటీఆర్ నేతృత్వంలో మంత్రుల, అధికారుల బృందం ఆయన చాంబర్‌కు వెళ్లింది. గంటల తరబడి వెయిట్ చేశామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పుకున్నారు. టైమ్‌కు రాకుండా ముందుగానే ఎందుకొచ్చారంటూ పీయూష్ గోయల్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా కేంద్ర మంత్రులతో భేటీకి టైమ్ ఫిక్స్ చేసుకోకుండానే ఆరుగురు మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటిస్తున్నది. పార్లమెంటు సమావేశాల్లో మంత్రులు బిజీగా ఉండడంతో వీరికి మీటింగ్ టైమ్ ఎప్పుడు దొరుకుతుందనే అంశంపై స్పష్టత లేదు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్‌, కిషన్‌రెడ్డిని దూషించిన తర్వాతి పరిస్థితుల్లో టీఆర్ఎస్ నేతల ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

యాసంగి సీజన్‌లో ఏ రాష్ట్రం నుంచి కూడా పారాబాయిల్డ్ రైస్ కొనబోమంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే స్పష్టం చేశారు. పచ్చి బియ్యాన్ని మాత్రం కొంటామని క్లారిటీ ఇచ్చారు. కానీ తెలంగాణ వాతావరణ పరిస్థితుల్లో పచ్చిబియ్యంతో సమస్యలు ఉన్నాయని, ఎక్కువగా నూకలవుతాయని, అందువల్ల పారా బాయిల్డ్ తప్ప మరో మార్గంలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులు మాత్రం వానాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరించే మొత్తం ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని వాదిస్తున్నారు. యాసంగి సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా పచ్చి బియ్యం ఎన్ని టన్నులు కొంటుందో చర్చిస్తామంటున్నారు. పచ్చిబియ్యం సాధ్యం కాదంటూనే కోటాను ఫిక్స్ చేయడంపై కేంద్రం మీద ఒత్తిడి తేవాలనుకుంటున్నారు.

రణమా? శరణమా?

కేంద్రంతో అమీతుమీ యుద్ధమేనని, అగ్గి పుట్టిస్తానంటూ ఢిల్లీ వెళ్ళిన సీఎం కేసీఆర్ ఎవ్వరినీ కలవకుండానే హైదరాబాద్ వచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను, ద్వంద్వ విధానాలను ఎండగట్టడానికి ధర్నాలు, నిరసనలు, చావుడప్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే చర్చల కోసం మంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలంతా ఢిల్లీ రావాల్సిందిగా అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్ర మంత్రులతో కేంద్ర మంత్రుల చర్చల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రంతో టీఆర్ఎస్ పార్టీ రణమా, శరణమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.



Next Story