హోంమంత్రి ఎదుటే గులాబీ నేతల కోట్లాట..

by  |
హోంమంత్రి ఎదుటే గులాబీ నేతల కోట్లాట..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: టీఆర్ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. గోషామహల్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు హోం మంత్రి మహమూద్ అలీ ముందే తన్నుకున్నారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా ఆదివారం గోషామహల్ నియోజకవర్గ సన్నాహక సమావేశం రాంకోఠిలోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరవుతారని ప్రకటించారు. ముందుగా నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు నంద కిషోర్ వ్యాస్, కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, పరమేశ్వరి, ముఖేష్ సింగ్‌లను వేదిక మీదకు పిలిచారు.

అయితే నియోజకవర్గానికి చెందిన ఉద్యమ నాయకులు, సీనియర్ నేత ఆర్వీ మహేందర్ అక్కడే ఉన్నప్పటికీ ఆయనను వేదిక మీదకు పిలవకపోవడంతో సీనియర్ నాయకుడైన తనను వేదిక మీదకు ఎందుకు పిలువలేదని వారిని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో సమావేశానికి హాజరైన వారిలో ఉన్న జాంబాగ్ డివిజన్‌కు చెందిన పార్టీ నాయకుడు జైశంకర్ మహేందర్ కుమార్‌ను కించపర్చేలా మాట్లాడటంతో గొడవ మొదలైంది. స్టేజీ మీద ఉన్న నాయకులు వారిస్తున్నా వినకుండా ఒకరినొకరు దూషించుకుంటూ రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. అక్కడే బందోబస్తులో ఉన్న నారాయణగూడ పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తేవడంతో సమావేశం మొదలైంది. అయితే సమావేశానికి మంత్రి తలసానికి ఆలస్యమవడంతో ఆయన గొడవ సద్ధుమణిగే సమయానికి అక్కడికి చేరుకున్నారు.

క్రమ శిక్షణతో పని చేయాలి : మంత్రులు

పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో నడుచుకోవాలని మంత్రలు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొంటున్న సమావేశాలలో ఇలా గొడవలకు దిగే వారి పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో నాయకులందరూ ఐక్యంగా పని చేయాలని సూచించారు. అర్హులైన పట్టబధ్రులను ఓటర్లుగా నమోదు చేయడంతో పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మంత్రులు వెళ్లిన తర్వాత మళ్లీ లొల్లి..

సమావేశం ముగిసిన వెంటనే మంత్రులు వెళ్లిపోయారు. ఆ తరువాత మరో సారి ఇరువర్గాల నాయకులు కుమ్ములాటకు దిగారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడంతో అక్కడ కొద్ది సేపు యుద్ధ వాతావరణం నెలకొంది. మళ్లీ పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్ధుమణిగింది. అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇరు వర్గాల నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే పార్టీ అగ్రనాయకుల నుండి వచ్చిన ఆదేశాలతో ఇరువర్గాల నేతలు తమ ఫిర్యాదులను వెనక్కు తీసుకున్నారు. ఆర్వీ మహేందర్ కుమార్, జయశంకర్ గతంలో పార్టీ కోసం కలిసి పని చేశారు. అయితే గత కొన్నినెలలుగా వారి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం వారిద్దరూ పరస్పరం దాడులు చేసుకోవడం నియోజకవర్గం నాయకులను విస్తుపోయేలా చేసింది.


Next Story