బీజేపీ ఉచ్చులో టీఆర్ఎస్.. కేసీఆర్‌‌లో టెన్షన్ !

by  |
బీజేపీ ఉచ్చులో టీఆర్ఎస్.. కేసీఆర్‌‌లో టెన్షన్ !
X

దిశ, వెబ్‌డెస్క్: 2001లో టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి తనదైన ఎత్తుగడలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన కేసీఆర్.. ఫస్ట్‌టైం ఒక పార్టీ ఉచ్చులో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఉద్యమ సమయం నుంచి తనదైన ప్రసంగాలతో పొలిటికల్ హీట్ పుట్టించిన ఆయన.. ఎందుకు తప్పులో కాలేశారన్న పాయింట్ ప్రస్తుతం చర్చకు వస్తోంది. రాజకీయ మైలేజ్‌ కోసం తనదైన వ్యూహాలతో నిప్పు రాజేసినట్లుగా మాట్లాడి వాళ్లలో వాళ్లకే పొగపెట్టే కేసీఆర్.. ఎలా లాజిక్‌ మిస్సైయ్యారన్న అంశం హాట్ టాఫిక్ గా మారింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఓట్లు అడగడం పక్కన పెట్టి.. కేవలం కౌంటర్లకే పరిమితం కావల్సిన పరిస్థితులు వచ్చాయి.

హైదరాబాద్ నగరానికి రూ.67 వేల కోట్ల అభివృద్ధి పనులు చేశామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధి అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేద్దామని టీఆర్ఎస్ భావించింది. కానీ అనూహ్యంగా వరదలు రావడంతో ప్లాన్ మార్చుకోక తప్పలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాలనీల్లోకి వెళ్ళి ప్రజలను పలకరించడం, ఆ తర్వాత బాధిత కుటుంబాలకు తలా పది వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించి గంటల వ్యవధిలోనే అమల్లోకి తేవడం జరిగిపోయాయి. ఎన్నికల్లో దీన్ని ట్రంప్ కార్డుగా వాడుకోవాలనుకుంది. కానీ దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో టీఆర్ఎస్ ఒకింత ఆలోచనలో పడింది. బీజేపీ మాత్రం ఆ ఉత్సాహంతో హైదరాబాద్‌లో అఫెన్సివ్ వైఖరి తీసుకుంది.

టీఆర్ఎస్, మజ్లిస్ దోస్తానాను, మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలను తెరపైకి తెచ్చి బీజేపీ భావోద్వేగాలను రేకెత్తించింది. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని మరింత దూకుడు పెంచి సర్జికల్ స్ట్రైక్ కామెంట్ల దాకా తీసుకెళ్ళింది. టీఆర్ఎస్ అనివార్యంగా బీజేపీ ఎంచుకున్న హిందు-ముస్లిం ఎజెండాలో చిక్కుకోవాల్సి వచ్చింది. బీజేపీ కామెంట్లకు కౌంటర్ ఇవ్వడానికే పరిమితమైంది. అటు మజ్లిస్‌ను సొంతం చేసుకోలేక, ఇటు తనదైన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళలేక, బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయలేక డిపెన్స్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోయింది. ఎంతసేపూ బీజేపీ నేతలు చేసే వివాదాస్పద విమర్శలకు సంజాయిషీలు, సమాధానం చెప్పుకునే కౌంటర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోంది. ప్రత్యర్థులను ఉచ్చులోకి లాగే టీఆర్ఎస్ ఈసారి మాత్రం తనకు తెలియకుండానే బీజేపీ వేసిన మతం ఉచ్చులో ఇరుక్కుపోయింది. కక్కలేని, మింగలేని పరిస్థితుల్లో అటు మతాన్ని ఓన్ చేసుకోలేక, ఇటు సెక్యులర్ అని రుజువుచేసుకోలేక సతమతమవుతోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలుకు ముందే తనదైన ప్లాన్ అమలు చేసిన బీజేపీ.. తమ ప్రత్యర్థి ఎంఐఎం అని, టీఆర్ఎస్‌తో సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో కొత్త చర్చ తెరపైకి వచ్చి రాజకీయం రంజుగా మారింది. ఇదేక్రమంలో మొన్న ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా కేసీఆర్ చేసిన అగ్గిమండే హైదరాబాద్ కావాలా, మతకల్లోలం లాంటి వ్యాఖ్యలు సైడైపోయి, ఏమాత్రం ప్రభావం చూపలేదు. మళ్లీ నిన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రోహింగ్యాలు ఉన్న పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడం, వెంటనే అసదుద్దీన్ ఓవైసీ అందుకొని పాతబస్తీలో రోహింగ్యాలు ఉంటే కేంద్రం హోంమంత్రి ఏం చేస్తున్నారని సవాల్ విసరడంతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మొత్తం పాతబస్తీకి చేరి.. బీజేపీ, ఎంఐఎం మధ్యే తీవ్ర పోటీగా మారింది. ఇద్దరు ముగ్గురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చుతామని ఘాటు వ్యాఖ్యలు చేసినా టీఆర్ఎస్ మాత్రం… బీజేపీ, ఎంఐఎంకు కౌంటర్లకే మొగ్గు చూపుతోంది.

ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధులను కూల్చాలని అక్బరుద్దీన్ ఓవైసీ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేయడంతో.. మళ్లీ వెంటనే రియాక్ట్ అయిన బండి సంజయ్.. దమ్ముంటే కూల్చండని సవాల్ విసిరి, తాము తలచుకుంటే రెండుగంటల్లోనే దారుస్సలాంను కూల్చుతామని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ గ్రేటర్ ప్రచారంలో మాటల మంటలు రేగి… బీజేపీ, ఎంఐఎం నేతల వ్యాఖ్యలు తారాస్థాయికి చేరాయి. మళ్లీ మంత్రి కేటీఆర్.. బీజేపీ, ఎంఐఎం వ్యాఖ్యలను ఖండించి మరోసారి కౌంటర్ చేశారు తప్ప అస్సలు టీఆర్ఎస్ వ్యూహమే కనపడలేదు. గ్రేటర్ ఎన్నికల రాజకీయ ప్రచారం మొత్తం ఎటూ తిరిగినా ఎంఐంఎం, బీజేపీ మధ్యే నడుస్తూ చివరకు టీఆర్ఎస్ పార్టీ.. సుడిగుండంలో చిక్కుకున్నట్లు అయ్యింది.

అటు.. బీజేపీ హిందూవులకు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తూ ఓట్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఇటు ఎంఐఎం నేతలు.. బీజేపీపై విమర్శలు చేస్తూ ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎటు వెళ్లినా బీజేపీ, ఎంఐఎం మధ్యలోకి టీఆర్ఎస్ చిక్కుకున్నట్ల అయి.. ఆపార్టీ ఓట్లే సందిగ్ధంలో పడుతున్నాయి. ఇదేక్రమంలో బీజేపీ, ఎంఐఎంలు సక్సెస్‌గానే తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. ఈ పంచాయితీతో రెండు పార్టీలకే లాభం జరిగి.. స్తబ్దుగా ఉన్న వారు మాత్రమే టీఆర్ఎస్‌కు ఓటర్లుగా మారే అవకాశం ఉంటుంది. అయితే కేసీఆర్.. ఈ సిచ్వేషన్‌ను అంచనా వేయలేక తప్పులో కాలేశారా, లేకుంటే ఈ ఇద్దరి పంచాయితీ టీఆర్ఎస్‌కే కలిసి వస్తుందని నమ్ముతున్నారా అన్నది ఫలితాల తర్వాత తెలియాల్సిన అంశం. ఏది ఏమైనా పక్కా పొలిటీషియన్‌ అయినా కేసీఆర్.. బీజేపీ ఉచ్చులో చిక్కుకొని గ్రేటర్‌లో ఎన్నికల్లో టెన్షన్ పడుతున్నారన్న విషయం మాత్రం రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది.



Next Story