TRS డబుల్ ధమాకాకు భారీ ప్లాన్.. గెలిస్తే అలా.. ఓడితే ఇలా.?

by  |
TRS vijaya garjana sabha
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ వరంగల్‌లో వచ్చే నెల 15న ‘విజయగర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. కనీసం 10 లక్షల మందిని తరలించేలా ప్లాన్ చేస్తున్నది. దానికి తగినట్లుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నది. ఒకవైపు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ధీమా, మరోవైపు పార్టీ ఆవిర్భవించి ఇరవై ఏండ్లు పూర్తి చేసుకున్న సంబురాలకు ప్రతీకగా ‘విజయగర్జన’ అని నామకరణం చేసింది.

కానీ, హుజూరాబాద్ ఫలితం తారుమారైతే అనే అనుమానం ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతున్నది. వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. విజయగర్జన అని పేరు పెట్టుకున్నందున ఆరు నూరైనా హుజూరాబాద్‌లో గెలవాల్సిందేననే పట్టుదల స్థానిక నేతల్లో పెరిగింది. లేకుంటే వరంగల్ భారీ సభ పేరుకు తగిన హుందాతనం ఉండదేమో అనే సంశయం వారిని టెన్షన్ పెడుతున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్నదని కేటీఆర్‌పైకి చెప్తున్నా పార్టీ మాత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఐదు నెలలుగా పదుల సంఖ్యలో పార్టీ నాయకులను అక్కడ ప్రచారంలోకి దించింది.

హుజూరాబాద్‌లో గెలిస్తే పేరుకు తగినట్లుగానే అది విజయగర్జన సభే అవుతుందని లేదంటే పార్టీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నందున దానికి మాత్రమే పరిమితమై చేసే కార్యక్రమంలా ఉంటుందనే అభిప్రాయాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. అంచనాలకు తగినట్లుగా హుజూరాబాద్‌లో గెలిస్తే అది విజయగర్జన సభకు డబుల్ ధమాకా అవుతుందన్న ధీమానూ వ్యక్తం చేస్తున్నారు.

ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగానే..

హుజూరాబాద్‌లో వంద శాతం టీఆర్ఎస్ గెలుస్తుందంటూ ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన ఇన్‌పుట్స్ ఆధారంగానే పార్టీ అధినేత కేసీఆర్ విజయగర్జన అని పేరు పెట్టుకొని గ్రాండ్‌గా సభను నిర్వహించాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై అటు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి, సొంత సర్వే సంస్థల నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు కేసీఆర్. గెలుపు ఖాయమన్న ధీమా ఏర్పడిన తర్వాతనే సీఎం కేసీఆర్ విజయగర్జనపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని, టైటిల్‌కు తగినట్లుగానే హుజూరాబాద్ ఫలితం వస్తుందన్న ధీమాతో గులాబీ పార్టీ నేతలున్నారు.

హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న టీఆర్ఎస్ స్థానిక నాయకులు మాత్రం గెలుపుపై ఇంకా సంపూ‌‌ర్ణ విశ్వాసాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఫిఫ్టీ-ఫిఫ్టీ చాన్స్ అనే తీరులో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లినా.. ఇప్పుడు హుజూరాబాద్‌లో కనిపిస్తున్న విచిత్ర వాతావరణం చూడలేదనే అభిప్రాయంతో ఉన్నారు. ప్రజలు గతంలోలాగా ఓపెన్‌గా లేరని, పైకి చెప్తున్నదాన్నే పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేమని, మనసులోని భావాన్ని బయటికి మనస్ఫూర్తిగా వ్యక్తీకరించడంలేదని, అందుకే సరైన అంచనాకు రాలేకపోతున్నామని వారు పేర్కొన్నారు.

భారీ బహిరంగ సభ వెనుక..

హుజూరాబాద్‌లో అనూహ్య ఫలితం ఎదురైనట్లయితే టీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్న విజయ గర్జనగా కేడర్‌కు పార్టీ సందేశమివ్వాలనుకుంటున్నది. హుజూరాబాద్‌లో ఎదురైన చేదు అనుభవంతో కేడర్ డీలా పడకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఉత్తేజపర్చడానికి దీనిని వేదికగా చేసుకోనున్నది. సహజంగా ఎన్నికలకు వెళ్లడానికి ముందు భారీ బహిరంగ సభ నిర్వహించడం టీఆర్ఎస్‌కు రివాజు.

2018 సెప్టెంబరు 6న అర్ధంతరంగా అసెంబ్లీని రద్దు చేయడానికి నాలుగు రోజుల ముందు కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభను అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయగర్జన సభనూ గతంలో ఎన్నడూ లేనంత గ్రాండ్‌గా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మళ్లీ ముందస్తు తప్పదా? అనే సందేహాలకు ఆస్కారం ఇచ్చినట్లయింది. బీజేపీ, కాంగ్రెస్ బలం పుంజుకుంటున్నాయన్న ప్రస్తుత తరుణంలో పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చేంత బలంగా ఉంచుకోడానికి, కేడర్‌ను కాపాడుకోడానికి, టీఆర్ఎస్‌ ఇప్పటికీ పటిష్టంగానే ఉందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడమే విజయగర్జన లక్ష్యమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Next Story