హోంగార్డులకు రక్షణ ఎవరు?

by  |
హోంగార్డులకు రక్షణ ఎవరు?
X

దిశ, వరంగల్: సభలు, సమావేశాలు, మరే ఇతర కార్యక్రమంలోనైనా ప్రజలు, నాయకులకు వారు రక్షణగా ఉంటారు. కానీ, వారి జీవితాలకు మాత్రం తగిన రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వం వివక్ష చూపుతోంది. పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి తగిన గౌరవం దక్కడం లేదు. వారే హోంగార్డులు. వారికి సకాలంలో వేతనాలు, అలవెన్స్‌లు అందక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హోంగార్డులను ప్రగతి భవన్‌కు పిలుచుకుని ఇచ్చిన హామీలు సైతం నేరవేరలేదు. పక్క రాష్ట్రం ఆంధ్ర‌ప్రదేశ్‌లో హోంగార్డుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారనీ, తెలంగాణలో మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది హోంగార్డులు కుటుంబాలను పోషించలేని దుస్థితిలో ఆత్మహత్యలకూ వెనకాడటం లేదు.

సంక్షేమ సారథి ఎక్కడా?

రోజూ తమ ప్రభుత్వం సంక్షేమంలో దేశంలోనే నెం.1 అని చెప్పే టీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు హోంగార్డుల సంక్షేమం పట్ల ఎందుకు నోరు మెదపడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 16 వేలకు పైగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 600 మందికిపైగా ఓడీ (అదర్ డ్యూటీ) ల పేరిట ఇతర శాఖల్లో పనిచేస్తున్నారు. రవాణా, రైల్వే, ఆర్టీసీ, మున్సిపాలిటీ, ఫైర్, ఎఫ్‌సీ‌ఐ, ఎలక్ట్రిసిటీ తదితర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకుగానూ ఆయా శాఖలే వేతనాలు చెల్లిస్తాయి. ఇటీవల కొన్నిశాఖలు వేతనాలు చెల్లించలేమంటూ హోంగార్డులను సొంతశాఖకు రిటర్న్ చేసింది. దీంతో పోలీస్ శాఖకు కొత్త సమస్య ఎదురైంది. అప్పట్లో అవసరాలకు మించి హోంగార్డుల నియమించగా ప్రస్తుతం ఇబ్బందిగా పరిణమించింది. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పోలీస్ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల్లో రోటేషన్ పద్ధతిలో హోంగార్డులకు డ్యూటీలు వేస్తున్నారు. ప్రతినెలా 50 నుంచి 100 మంది పని లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పని చేస్తేనే వేతనం ఇచ్చే పరిస్థితులున్న నేపథ్యంలో వారికి వేతనాలు రావడం లేదని సమాచారం. జిల్లాల పునర్విభజన సమయంలో ఆర్టర్ టు సర్వ్ పేరిట కానిస్టేబుళ్లతో సహా హోంగార్డులను ఆయా జిల్లాలకు బదిలీ చేశారు. ఏడాది తర్వాత కానిస్టేబుళ్లను తిరిగి వారి ఆసక్తి మేరకు బదిలీలు చేశారు. కానీ, హోంగార్డులు మాత్రం మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బందోబస్తు డ్యూటీలు చేసిన క్రమంలో హోంగార్డులకు టీఏ, డీఏ చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులు నామమాత్రంగా ఎంతో కొంత ముట్టజెప్పి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలూ ఉన్నాయి. కానిస్టేబుళ్ల మాదిరిగానే హోంగార్డులకు యూనిఫాం అలవెన్స్ కింద ప్రతి ఏడాది రూ. 7500 ఇచ్చేలా జారీ చేసిన జీఓ కాగితాలకే పరిమితమైందనే ఆరోపణలున్నాయి. కొన్ని జిల్లాల్లో అమలు చేసినప్పటికీ తర్వాత పరిస్థితి మొదటికొచ్చిందనే విమర్శలున్నాయి. ఎవరైనా ధైర్యం చేసి అధికారుల నోటీసుకు తీసుకెళ్తే లేనిపోని సాకులతో పనిష్‌మెంట్‌కు గురిచేస్తున్నట్లు సమాచారం.

ఆరోగ్య భద్రతేదీ..?

హోంగార్డులకు ఆరోగ్య భద్రత కరువైందనే ప్రచారం జరుగుతోంది. తెల్లరేషన్ కార్డు పొందేందుకు అర్హత లేక ప్రభుత్వం నుంచి ఆరోగ్య భద్రత కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డులు రోగాలపాలవుతున్నారనీ, వారి ఆరోగ్య సంరక్షణ గురించి ప్రభుత్వం, అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో హోంగార్డులు సహజంగా లేదా ప్రమాదం సంభవించే మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం, ఇంటి స్థలం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకుంటోంది. హోంగార్డులకు ఆరోగ్య భద్రత కల్పిస్తోంది. కానీ, తెలంగాణలో భిన్నమైన పరిస్థితి ఉన్నది. కేవలం ప్రమాదాల వల్ల మరణిస్తేనే బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తున్నట్లు సమాచారం. కొన్నిజిల్లాల్లో హోంగార్డు సహజంగా మరణించినప్పుడు బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు తోటి ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్నిజమచేసి అందజేస్తున్నారు. ఏపీలోలాగానే హోంగార్డుల సహజ మరణానికి రూ.5లక్షల పరిహారం అందించాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.

tags : trs govt, discrimination, home guards


Next Story

Most Viewed