షర్మిల ట్వీట్స్… సర్వత్రా విమర్శలు

by  |
షర్మిల ట్వీట్స్… సర్వత్రా విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పజెప్పగా లేనిది ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా’ అంటూ షర్మిల చేసిన ట్వీట్ విమర్శలపాలవుతోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు చేసిందేమిటో గుర్తు చేసుకోండి అంటూ ఫైర్ అవుతున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. అంతేకాదు బ్రదర్ అనిల్ కరోనా వైరస్ ను మీ సమక్షంలోనే తొక్కేశారు కదా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

అలాగే ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆమె చేసిన విజ్ఞప్తి కూడా చర్చనీయాంశంగా మారింది. ‘స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మాత్రం నలుగురితో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే గ్లాస్ షీల్డ్ ను ఉపయోగించి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మరి లక్షల మంది పాల్గొనే ఎన్నికల్లో మనం ఈ నిబంధనలు ఎంతవరకు పాటించగలం. కాబట్టి ఎన్నికలు వాయిదా వేయాలి’ అని షర్మిల ట్వీట్ చేశారు. ఇది కూడా అబాసుపాలవుతోంది.

షర్మిల ట్వీట్స్ పై టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాల గురించి మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. బహిరంగ సభలు నిర్వహించినప్పుడు మీకు ఇవన్నీ గుర్తు లేవా అని ప్రశ్నిస్తున్నారు. మీ సభకు హాజరై ఎంతమంది కరోనా బారిన పడ్డారో తెలియదా అని నిలదీస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించి ఉంటే షర్మిల ప్రధాన అనుచరుడు బాలకృష్ణారెడ్డి కరోనాతో మృతిచెందేవాడు కాదని విమర్శిస్తున్నారు. అంతేకాదు, షర్మిల ఇటీవల నిర్వహించిన ఖమ్మం సభ, ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ఉద్యోగ దీక్షలోనూ మాస్క్ వినియోగించకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు చర్చించుకుంటున్నారు.


Next Story