ఆర్చరీ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగమ్మాయి జ్యోతి

by Dishanational3 |
ఆర్చరీ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగమ్మాయి జ్యోతి
X

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ మళ్లీ మెరిసింది. కాంపౌండ్ మహిళల టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన ఆమె.. మిక్స్‌డ్ కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మతో కలిసి ఫైనల్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో జ్యోతి, అభిషేక్ ద్వయం 155-151 తేడాతో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రా-లాట్ మెక్సిమో జోడీని ఓడించింది. శనివారం ఫైనల్‌లో ఎస్టోనియా ఆర్చరీలతో భారత జంట తలపడనుంది.

మరోవైపు, రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ సెమీస్‌లో తెలుగు కుర్రాడు ధీరజ్, అంకిత జోడీ నిరాశపరిచింది. లిమ్ సిహ్యున్-కిమ్ వూజిన్(కొరియా) జోడీ 6-0 తేడాతో ఓడిపోయింది. సెమీస్‌లో ఓడినా ధీరజ్ జట్టుకు ఇంకా పతక ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆదివారం జరిగే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో గెలిస్తే కాంస్య పతకం దక్కించుకోవచ్చు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణి దీపిక కుమారి సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె 6-4(27-28, 27-27,29-28,29-27, 28-28) తేడాతో జియోన్ హున్యుంగ్(కొరియా)పై విజయం సాధించింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో తరుణ్‌దీప్ రాయ్ క్వార్టర్స్‌లో ఓడిపోయాడు.



Next Story

Most Viewed