‘రెండో దశ’ పోలింగ్ సమాప్తం.. టాప్ పాయింట్స్ ఇవే

by Dishanational4 |
‘రెండో దశ’ పోలింగ్ సమాప్తం.. టాప్ పాయింట్స్ ఇవే
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్​సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్‌సభ స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత కూడా క్యూలైన్లలో ఉన్న వారిని కలుపుకుంటే పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని, దీనిపై శనివారం ఉదయం వివరాలను వెల్లడిస్తామన్నారు. పోలింగ్ వేళ పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలలో లోపాలు, బోగస్‌ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని మథుర, రాజస్థాన్‌లో బన్స్‌వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్భానిలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్‌ ముగించారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున బిహార్‌లోని బంకా, మాదేపూర, కగారియా, ముంగర్ లోక్‌సభ స్థానాల్లోని పలు పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహించారు.

ఏయే రాష్ట్రంలో ఎంత పోలింగ్ శాతం ?

శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు త్రిపురలో అత్యధికంగా 77.53 శాతం పోలింగ్ నమోదైంది. మణిపూర్‌లో 76.06 శాతం, ఛత్తీస్‌గఢ్‌‌లో 72.13 శాతం, పశ్చిమబెంగాల్‌‌లో 71.84 శాతం, అసోంలో 70.66 శాతం, జమ్మూకశ్మీర్‌‌లో 67.22 శాతం ఓటింగ్ జరిగింది. కేరళలో 63.97 శాతం, కర్ణాటకలో 63.90 శాతం, రాజస్థాన్‌‌లో 59.19 శాతం, మధ్యప్రదేశ్‌‌లో 54.83 శాతం, మహారాష్ట్రలో 53.51 శాతం, బిహార్‌లో 53.03 శాతం, ఉత్తరప్రదేశ్‌‌లో 52.74 శాతం పోలింగ్ నమోదైంది.

ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలివే..

మొదటి విడత, రెండో విడత ఎన్నికలతో తమిళనాడు(39), కేరళ(20), రాజస్థాన్‌ (25), త్రిపుర (2), ఉత్తరాఖండ్‌ (5), అరుణాచల్‌ప్రదేశ్‌ (2), మేఘాలయ (2), అండమాన్‌ నికోబార్‌ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్‌ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1), లక్షద్వీప్‌ (1) ఎన్నికలు పూర్తయ్యాయి. తొలి విడతలో 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగగా 65.5 శాతం పోలింగ్ నమోదైంది. ఇక మూడో విడత ఎన్నికలు 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్నాయి.

ఒకే కుటుంబానికి చెందిన 85 మంది ఓటు

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర్ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన 85 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరానికి చెందిన బాదం కుటుంబసభ్యులు ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పోలింగ్ బూత్‌కు కలిసి వెళ్లి ఓటు వేశారు. ఇప్పటి వరకు 18కి పైగా ఎన్నికల్లో ఓటు వేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబసభ్యులంతా ఓటింగ్ రోజున ఒక్కటయ్యారు.



Next Story

Most Viewed