అటవీ బిడ్డలకు పెద్దపులి టెన్షన్..

by  |
అటవీ బిడ్డలకు పెద్దపులి టెన్షన్..
X

దిశ ప్రతినిధి, వరంగల్ : పెద్ద పులి సంచారంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంత ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మాయదారి మృగం ఎటు నుంచి వస్తుందో.. ఎప్పుడు దాడి చేస్తుందోనని అడవి బిడ్డలు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న ఆనవాళ్లు ఉన్నాయి. పెద్దపులి పంట చేలల్లో దూది తీస్తున్న కూలీలకు కనిపించింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో పంట చేలల్లో పనులకు వెళ్లాలంటే కూలీలు జంకుతున్నారు.

జనారణ్యంలోకి పెద్దపులి..

ములుగు, మహబూబాబాద్‌, భూపాలపల్లి జిల్లాల అటవీ సరిహద్దు గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లవ్వాల, బంధాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల పరిధిలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దపులికి రోజూ 40 నుండి 70 కిలోమీటర్ల మేర నడిచే సామర్థ్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా పెద్ద పులి ఎప్పుడు ఎటువైపునకు సంచరిస్తుందో తెలుసుకోవడం కష్టతరంగా మారిందని పేర్కొంటున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.‌ ముఖ్యంగా పులి సంచరించే సమీప ప్రాంతాల ప్రజలందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.

రెండు నెలల క్రితం మేడారంలో..

రెండు నెలల క్రితం మేడారం అడవుల్లో కనిపించిన పెద్ద పులి ఆ తర్వాత మహాదేవపూర్ అడవుల్లో ప్రత్యక్షమైంది. అనంతరం పెద్దపల్లి జిల్లా, చిట్యాల అడవుల్లో పులి అడుగులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారం క్రితం ములుగు మండలం దేవునిగుట్టలో పులి గాండ్రింపులు విన్పించాయని కూలీలు తెలిపారు. ఆదివారం కూడా పెద్దపులి గాండ్రింపులు వినిపించినట్లు మరికొందరు కూలీలు చెప్పారు. ప్రాణభయంతో పరుగులు తీసినట్లు తెలిపారు. సర్వాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి దేవునిగుట్ట సమీపంలో ఉన్న తన పత్తిచేనులో 20 మంది కూలీలతో పనులు చేయిస్తున్నాడు. పెద్దపులి గాండ్రించడంతో కూలీలు గ్రామంలోకి పరుగులు తీశారు.

మూడు జిల్లాల్లో‌ ఒకటే పులి..

రెండు రోజుల క్రితం పాకాల, కొత్తగూడ అడవుల్లో పులి సంచారాన్ని పాదముద్రల ఆధారంగా అటవీ అధికారులు నిర్ధారించారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో గార్ల మండలం ముల్కనూర్‌లో ఓ మిరప తోటలో పెద్దపులి అడుగుల్ని గుర్తించారు. ఈ మూడు జిల్లాల పరిధిలోని అడవుల్లో సంచరించే పులి ఒక్కటే అని నిర్ధారణకు వచ్చారు. కొన్ని నెలల కిందట రాంపూర్‌ గ్రామంలో ఎద్దుతో పాటు పశువులను చంపినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ పులే ఏటూర్ నాగారం, పాకాల అభయారణ్యం‌లో‌ సంచరిస్తూ షెల్టర్ కోసం వెతుకుతున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.‌ ముఖ్యంగా పశువుల కాపరిలు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.



Next Story