ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ.. ఏనుగు మలంతోనే రుచి!

by Naga Rani Yarlagadda |

బ్లాక్ ఐవరీ కాఫీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కేజీ కాఫీ బీన్స్ ధర లక్షల్లో ఉంటుంది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ.. ఏనుగు మలంతోనే రుచి!
X

దిశ, వెబ్‌డెస్క్: మనలో కాఫీ లవర్స్ చాలా మంది ఉంటారు. ఫిల్టర్ కాఫీ, ఇన్ స్టంట్ కాఫీ లేనిదే తెల్లారదు కూడా. ఇక ఆఫీస్ వర్క్ ప్రెషర్, తలనొప్పికే కాదు.. టైమ్ పాస్ కు కూడా కాఫీ తాగుతుంటారు. ఇవే కాదు.. ఇంకా చాలా రకాల కాఫీలు ఉన్నాయి. కొన్ని వేలల్లో ఉంటే మరికొన్ని లక్షల రూపాయల ఖరీదుంటాయి. అలాంటి కాఫీల్లో ఒకటి బ్లాక్ ఐవరీ కాఫీ. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ. బ్లాక్ ఐవరీ కాఫీ కేజీ ధర 1500 డాలర్ల నుంచి 3000 డాలర్ల వరకూ ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,50,000 నుంచి రూ.2,60,000 వరకూ ఉండొచ్చు. ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద 35-40 గ్రాముల చిన్న ప్యాకెట్ ధర సుమారు రూ. 12,000 నుండి రూ. 23,000 వరకు ఉంటుంది. అయితే ఈ కాఫీని ఏనుగు మలంతో తయారు చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? ప్రత్యేకంగా ఈ కాఫీ థాయ్ ల్యాండ్ లో లభిస్తుంది.

ఏనుగుల మలంతోనే ఎందుకు?

థాయిలాండ్‌లోని ఏనుగులకు అరబికా రకానికి చెందిన నాణ్యమైన కాఫీ పండ్లను (Coffee Cherries) అరటిపండ్లు, చింతపండు వంటి ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినిపిస్తారు. ఆ కాఫీ పండ్లు దాని జీర్ణకోశంలోకి వెళ్తాయి. అక్కడ ఉండే ఎంజైమ్‌లు కాఫీ గింజల్లోని ప్రొటీన్లను విచ్ఛిన్నం చేస్తాయి. దీనివల్ల కాఫీలో ఉండే చేదు తగ్గి, ఒక రకమైన తియ్యటి, మృదువైన రుచి వస్తుంది. ఈ ప్రక్రియకు సుమారు 15 నుండి 70 గంటల సమయం పడుతుంది. ఏనుగు విసర్జించిన మలం నుండి ఈ కాఫీ గింజలను నైపుణ్యం కలిగిన కార్మికులు చేతులతో వేరు చేస్తారు. సేకరించిన గింజలను చాలా జాగ్రత్తగా కడిగి, ఎండలో ఎండబెడతారు. ఆ తర్వాత వాటి పై పొరను తొలగించి, బాండీలో వేసి రోస్ట్ చేస్తారు. వాటిని ప్యాక్ చేసి విక్రయిస్తారు.

కాగా.. తక్కువ దిగుబడి, ఏనుగుల మలం నుంచి సేకరించిన గింజలతో చేయడం వల్ల ఈ కాఫీ బీన్స్, పొడి ధర ఎక్కువగా ఉంటుంది. సుమారు 33 కిలోల కాఫీ పండ్లను ఏనుగుకు తినిపిస్తే, కేవలం 1 కిలో కాఫీ గింజలు మాత్రమే లభిస్తాయి. ఎందుకంటే చాలా గింజలు ఏనుగు నమిలేటప్పుడు విరిగిపోతాయి లేదా జీర్ణమైపోతాయి. ఒక కప్పు కాఫీ తాగాలంటే దాదాపు రూ. 4,000 నుండి రూ. 5,000 వరకు ఖర్చవుతుంది. ఇందులో సాధారణ కాఫీలో ఉండే చేదు (Coffee Bitterness) అస్సలు ఉండదు. చాక్లెట్, మాల్ట్, కొద్దిగా గడ్డి వాసనతో కూడిన ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అయితే ఏనుగు మలం నుంచి వచ్చిన గింజలతో చేయకపోతే ఆ కాఫీ అంత రుచిగా ఉండదా? అంటే కచ్చితంగా ఉండదంటున్నారు ఆ కాఫీ ప్రియులు. బ్లాక్ ఐవరీ కాఫీ ప్రత్యేకత అంతా ఆ ఏనుగు జీర్ణక్రియలోనే ఉందని, సాధారణ పద్ధతిలో తయారు చేస్తే అది కేవలం ఒక మంచి 'అరబికా కాఫీ' అవుతుంది తప్ప బ్లాక్ ఐవరీ కాఫీ రుచి రాదంటున్నారు.

Next Story