Viral video: రైలుకు వేలాడిన యువకుడు.. ఈ దెబ్బతో జీవితంలో దొంగతనాల జోలికి వెళ్లడు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-09 10:29:38  IST  )

రద్దీగా ఉండే బస్సు ప్రయాణాల్లో, రైలు ప్రయాణాల్లో దొంగతనాలు జరుగుతుండటం తరచూ చూస్తుంటాం.

Viral video: రైలుకు వేలాడిన యువకుడు.. ఈ దెబ్బతో జీవితంలో దొంగతనాల జోలికి వెళ్లడు!
X

దిశ, వెబ్ డెస్క్: రద్దీగా ఉండే బస్సు ప్రయాణాల్లో, రైలు ప్రయాణాల్లో దొంగతనాలు జరుగుతుండటం తరచూ చూస్తుంటాం. ఇటీవల కాలంలో అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైలులో (Train) కిటికీ నుంచి దొంగలు ప్రయాణికుల ఫోన్లు (Phones), పర్సులు (Purses) కొట్టేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నిత్యం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే, తాజాగా ఈ తరహా దొంగతనానికి పాల్పడబోయిన ఓ యువకుడికి ప్రయాణకులు చుక్కలు చూపించారు. ఇంకెప్పుడు దొంగతనాల జోలికి పోకుండా భలేగా బుద్ధి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్‌గా మారింది.

బీహార్‌లోని (Bihar) భాగల్పూర్ జిల్లా సమీపంలోని ఓ రైల్వే స్టేషన్ (Railway station) నుంచి రైలు పయనిస్తుంది. ఆ రైలుకు ఓ యువకుడు వేలాడుతుండటం వీడియోలో చూడొచ్చు. అయితే, చూసేవారు అతడేదో స్టాంట్స్ చేస్తున్నాడనుకుంటే పొరపాటే.. ఎందుకంటే మనం మాట్లాడుకునే దొంగ అతడే. స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుండగా, ఆ యువకుడు కిటికీ నుంచి ఓ ప్రయాణికుడి ఫోన్ దొంగలించబోయాడు. అయితే, ప్రయాణికులు ఆ దొంగను గుర్తించి, వెంటనే లోపలి నుంచి అతడి చేతులను గట్టిగా పట్టుకున్నారు. రైలు వేగంగా వెళ్తున్నప్పటికీ వదలలేదు.

దీంతో ఆ యువకుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిటికీకి వెలాడుతూ దాదాపు కిలో మీటరు మేర అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొందరు వ్యక్తులు యువకుడిని కిటికీలోంచి కిందకు దించారు. ఇదంతా రైలులోని ప్రయాణికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా వైరల్‌గా మారింది. దొంగతనానికి వచ్చి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడని కొందరు, ఈ దెబ్బతో జీవితంలో మళ్లీ దొంగతనం చేయడని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, బీహార్‌లో ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి.

Next Story