‘పోలీసు మామలు’ పేరిట వాట్సాప్ గ్రూప్.. వీడియోతో షాకింగ్ ఎంట్రీ ఇచ్చిన ఎస్సై

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-04 07:09:02  IST  )

గోదావరిఖనిలో పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి యువకులు క్రియేట్ చేసిన ‘పోలీస్ మామల స్క్వాడ్’ వాట్సాప్ గ్రూపు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

‘పోలీసు మామలు’ పేరిట వాట్సాప్ గ్రూప్.. వీడియోతో షాకింగ్ ఎంట్రీ ఇచ్చిన ఎస్సై
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా (Social Media)ను ఈరోజుల్లో కుర్రాళ్లు చిత్రవిచిత్రంగా వాడేస్తున్నారు. మంచి, చెడు అనే తేడా లేకుండా అన్నింటికి వాట్సాప్ గ్రూపు (Whatsaap Groups)లు క్రియేట్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కుర్రాళ్లు చేసిన పనికి.. సాధారణ ప్రజలు ‘ఎంతకు తెగించార్రా మీరు!’ అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రోడ్లపై పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కొందరు యువకులు వేసిన మాస్టర్ ప్లాన్ రివర్స్ అయింది. వినూత్నంగా 1,024 మందితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పోలీసులకు చిక్కకుండా తిరగాలనుకున్న వారి ఆశలపై స్థానిక ఎస్ఐ నీళ్లు చల్లారు. స్వయంగా ఆ గ్రూపులోకి ఎంట్రీ ఇచ్చి వణుకు పుట్టించారు.

అసలు ఏంటీ ‘పోలీస్ మామల స్క్వాడ్’?

గోదావరిఖనిలో పోలీసులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు.. ఎక్కడ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు? అనే విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవడానికి కొందరు యువకులు ‘పోలీస్ మామల స్క్వాడ్’ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి నడుపుతున్నారు. పోలీసులు ఒక చోట తనిఖీలు చేస్తుంటే, ఆ రూటులో వెళ్లకుండా గ్రూపులో మెసేజ్ ఇచ్చి అందరినీ అప్రమత్తం చేయడం వీరి పని. అయితే, ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అనుమానం వచ్చి పోలీసులు అతని ఫోన్ చెక్ చేయగా, ఈ వింత వాట్సాప్ గ్రూప్ బయటపడింది. గ్రూపులోని మెసేజ్‌లు చూసి పోలీసులు అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఏమాత్రం ఆలస్యం చేయకుండా సదరు యువకుడి ఫోన్ ద్వారానే ఆ గ్రూపులోకి జాయిన్ అయ్యారు. వెంటనే ఓ వీడియో సందేశాన్ని గ్రూపులో పోస్ట్ చేశారు

‘ఏం మామలూ.. బాగున్నారా? మీ నంబర్లన్నీ నా దగ్గర సేవ్ అయి ఉన్నాయి. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరినీ త్వరలోనే పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తాను. అప్పటి వరకు ఎంజాయ్ చేయండి!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఎస్సై వీడియో చూడగానే గ్రూపులోని సభ్యులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆయన ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story