VIRAL: ప్రమాదంలో ‘విక్రమశిల సేతు’.. ఏ క్షణంలోనైనా కుప్పకూలే చాన్స్!

by Kema Shiva Kumar |

బీహార్‌లోని అత్యంత కీలకమైన విక్రమశిల సేతు పిల్లర్ల రక్షణ గోడలు గంగానదిలో కూలిపోయాయి.

VIRAL: ప్రమాదంలో ‘విక్రమశిల సేతు’.. ఏ క్షణంలోనైనా కుప్పకూలే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌ (Bihar)లో గంగానదిపై ఉన్న అతిముఖ్యమైన విక్రమశిల సేతు (Vikramshila Sethu) మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వంతెన పిల్లర్లను నదీ ప్రవాహం నుంచి రక్షించే రక్షణ గోడల వరుసగా కూలిపోతుండటంతో పెను ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వంతెనలోని మధ్య భాగంలో ఉన్న పిల్లర్ల రక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. పిల్లర్ నెంబర్ 18, 19 చుట్టూ ఉన్న రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమై గాలిలో వేలాడుతున్నాయి. ఏ క్షణమైనా ఇవి కూడా కూలిపోయే అవకాశం ఉంది.

తీవ్ర ఆందోళనలో ప్రయాణికులు..

పిల్లర్లను కాపాడే రక్షణ గోడలు లేకపోవడం వల్ల నది ఉధృతి నేరుగా పిల్లర్ల పునాదులపై పడుతుంది. దీంతో వంతెన స్థిరత్వం దెబ్బతింటుందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వంతెనపై భారీ వాహనాలు వెళ్లేటప్పుడు అసాధారణమైన కంపనం (Vibrations) వస్తోందని, రోడ్లపై పగుళ్లు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. అయితే, ఈ వంతెన భాగల్‌పూర్‌ను నౌగాచియా, సీమాంచల్, కోసి ప్రాంతాలతో కలుపుతుంది. జార్ఖండ్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలు కూడా దీనిపై నుంచే ప్రయాణిస్తాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణించే ఈ వంతెన విఫలమైతే, ఉత్తర మరియు దక్షిణ బీహార్ మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది.

రంగంలోకి నిపుణుల బృందం..

విక్రమశిల సేతు పరిస్థితిపై తాజాగా బిహార్ ప్రభుత్వం స్పందించింది. భాగల్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ దీనిపై విచారణకు ఆదేశించారు. నేషనల్ హైవేస్ (National Highways) విభాగం, సాంకేతిక నిపుణుల బృందం వంతెన పరిస్థితిని సమీక్షించడానికి ఇవాళ స్పాట్‌కు చేరుకుంది. నివేదిక అందిన తర్వాతే భారీ వాహనాల రాకపోకలపై నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story