- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుడి రచ్చ.. నిలదీసిన తోటి ప్యాసింజర్!
హైదరాబాద్ మెట్రో రైల్లో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తూ సీట్లపై కాళ్లు పెట్టి కూర్చున్న ఓ వ్యక్తి ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: మహానగరంలో నిత్యం లక్షలాది మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro) సామాన్యుడికి ఎంతో సౌకర్యవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ. అయితే, కొందరు ప్రయాణికులు కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నారు. తాజాగా, మెట్రో రైల్లో ఎదురుగా ఉన్న సీట్లపై కాళ్లు చాపి కూర్చున్న ఓ వ్యక్తిని, మరో ప్రయాణికుడు కెమెరా ఎదుట నిలదీసిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..
మెట్రో రైలు ప్రయాణికులతో నిండి ఉన్న సమయంలో ఓ వ్యక్తి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. తాను కూర్చున్న సీటుకు ఎదురుగా ప్రయాణికులు కూర్చునే రెండు ఖాళీ సీట్లపై కాళ్లను బార్ల చాపి పెట్టాడు. అక్కడ వేరే ప్రయాణికులు కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. మెట్రో రైలు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ చర్యను గమనించిన ఓ తోటి ప్రయాణికుడు వెంటనే తన జేబులోంచి మొబైల్ తీసి, ఆ వ్యక్తి ప్రవర్తనను రికార్డ్ చేస్తూ గట్టిగా ప్రశ్నించాడు. ‘ఇది పబ్లిక్ ప్రాపర్టీ.. మీ సొంత ఇల్లు కాదు. ఇలా సీట్లపై కాళ్లు పెట్టడం ఏంటి?’ అంటూ నిలదీశాడు.
తప్ప చేసి మళ్లీ రివర్స్ ఎటాక్..
అయితే, సదరు వ్యక్తి తప్పు తెలుసుకుని కాళ్లు కిందకు పెట్టాల్సింది పోయి.. వీడియో తీస్తున్న ప్రయాణికుడిపైనే ఎదురు తిరిగాడు. ‘నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు? ఆపు’ అంటూ పంచాయతీకి దిగాడు. అయితే, ఆ లొల్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు ప్రయాణికుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రోలో ప్రయాణించేటప్పుడు కనీస పద్ధతులు పాటించాలనే జ్ఞానం లేదా?’ అని కొందరు, ‘తప్పును ధైర్యంగా ప్రశ్నించిన ఆ తోటి ప్రయాణికుడిని అభినందించాలి’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.






