Tomato: ‘రోడ్డు’న పడిన టమాటా.. గిట్టుబాటు ధర లేక పంట పారబోత

by Kema Shiva Kumar |

టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. కనీస ఖర్చులు కూడా రాకపోవడంతో ఏకంగా రోడ్లపైనే టమాటాలను పారబోసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

Tomato: ‘రోడ్డు’న పడిన టమాటా.. గిట్టుబాటు ధర లేక పంట పారబోత
X

దిశ, వెబ్‌డెస్క్: కూరల్లో ఉండాల్సిన టమాటా.. నేడు రోడ్డుపాలైంది. ఊహించని విధంగా దిగుబడి పెరగడంతో మార్కెట్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో పెట్టుబడి కూడా రాక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను రోడ్డుపైనే ప్రదర్శించారు. నగర శివారులోని కందుకూరు సమీపంలో గల శ్రీశైలం రహదారిపై రైతులు భారీగా టమాటాలను కుప్పలుగా పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో 25 కిలోల టమాటా బాక్స్ కేవలం రూ.80 నుంచి రూ.100 వరకు మాత్రమే పలుకుతోంది. అంటే కిలో ధర కేవలం రూ.4కు పడిపోవడం గమనార్హం.

అయితే, పంటను కోయడానికి అయ్యే కూలీలు, మార్కెట్‌కు తీసుకెళ్లే రవాణా ఖర్చులు కూడా ఈ ధరతో రావడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇలా రోడ్డుపై పారబోస్తున్నామంటూ రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని లేదా తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story