"సూపర్ మూన్"ల విశేషాలివే

by Muthe.Rajitha |

కనువిందు చేసిన సూపర్ మూన్.. వింతలూ, అపోహలివే..!

సూపర్ మూన్ల విశేషాలివే
X

దిశ, వెబ్ డెస్క్ : ఆకాశంలో శనివారం సాయంత్రం నుంచి సూపర్ మూన్ కనువిందు చేసింది. భూమికి 14 శాతం దగ్గరగా రావడంతో 40 శాతం మరింత ప్రకాశవంతంగా దర్శనం ఇచ్చాడు చంద్రుడు. ఈ అద్భుతాన్ని నేరుగా చూసిన ప్రజలు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే అసలు ఈ సూపర్ మూన్స్ ఎందుకు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? అప్పుడు జరిగే భౌగోళిక మార్పులు ఏమిటో చూద్దాం.

అసలు సూపర్ మూన్ అంటే ఏమిటి?

'సూపర్ మూన్' అంటే చంద్రుడు భూమికి చాలా దగ్గరగా రావడం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు భూమికి చాలా దగ్గరగా వస్తాడు. దీన్ని సైన్స్ భాషలో దీనిని పెరిజీ అంటారు. అది పూర్ణిమ సమయంలో జరిగితే దానిని 'సూపర్ మూన్' అని పిలుస్తారు. సాధారణ పూర్ణిమ చంద్రుడితో పోలిస్తే, సూపర్ మూన్ సుమారు 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశంగా కనిపిస్తుంది. ఈ “సూపర్ మూన్” అనే పదాన్ని 1979లో అస్ట్రాలజర్ రిచర్డ్ నోల్లె పరిచయం చేశారు. సాధారణంగా చంద్రుడు భూమికి 3,60,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అంతకంటే దగ్గరగా ఉన్నప్పుడు పూర్ణిమ వస్తే దానిని సూపర్ మూన్‌గా పరిగణిస్తారు. ఇవి సంవత్సరానికి సాధారణంగా 3 నుంచి 4 సార్లు మాత్రమే జరుగుతాయి.

2025లో వచ్చిన సూపర్ మూన్స్

2025 సంవత్సరం సూపర్ మూన్స్ విషయంలో ప్రత్యేకమైన సంవత్సరం. ఎందుకంటే ఈ ఏడాది వరుసగా మూడు నెలల్లో మూడు సూపర్ మూన్స్ కనిపించాయి. సాధారణంగా ఇలా వరుసగా రావడం అరుదు. ఈ మూడు సూపర్ మూన్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చాయి.

*అక్టోబర్ 6, 7 తేదీల్లో మొదటి సూపర్ మూన్ కనిపించింది. దీనిని "హార్వెస్ట్ మూన్" అని పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు భూమికి సుమారు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. పంటల కాలంలో వచ్చే పూర్ణిమ కావడం వల్ల దీనికి హార్వెస్ట్ మూన్ అనే పేరు వచ్చింది. ఉత్తర అమెరికా వంటి ప్రాంతాల్లో ఇది ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ సూపర్ మూన్ సమయంలో కొన్ని తీర ప్రాంతాల్లో సముద్ర అలలు ఎక్కువగా నమోదయ్యాయి.

*నవంబర్ 5న రెండో సూపర్ మూన్ వచ్చింది. దీనిని "బీవర్ మూన్" అంటారు. శీతాకాలం రాకముందు బీవర్లు తమ గూళ్లు, డ్యామ్‌లు సిద్ధం చేసుకునే కాలం కావడం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ సమయంలో కూడా చంద్రుడు సుమారు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. యూరప్, ఆసియా ప్రాంతాల్లో ముఖ్యంగా మంచు కురిసిన ప్రాంతాల్లో ఈ చంద్రుడి ఫోటోలు చాలా అందంగా కనిపించాయి.

*డిసెంబర్ 4, 5న మూడవ సూపర్ మూన్ వచ్చింది. దీనిని "కోల్డ్ మూన్" లేదా "లాంగ్ నైట్ మూన్" అని పిలుస్తారు. ఇది శీతాకాలం మధ్యలో రావడం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ సూపర్ మూన్ తర్వాత వెంటనే జనవరి 2026లో మరో సూపర్ మూన్ రావడం వల్ల, ఇది వరుసగా నాలుగు సూపర్ మూన్స్ సీక్వెన్స్‌లో భాగమైంది.

2026లో రానున్న సూపర్ మూన్స్

2026లో కూడా మూడు సూపర్ మూన్స్ ఉన్నాయి. ఇవి జనవరి, నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. ఇది 2025 చివరలో మొదలైన సూపర్ మూన్ సీక్వెన్స్‌ను కంటిన్యూ చేస్తోంది.

*ఈ ఏడాది జనవరి 3న మొదటి సూపర్ మూన్ వచ్చింది. దీనిని "వుల్ఫ్ మూన్" అంటారు. శీతాకాలంలో తోడేళ్లు ఎక్కువగా అరుస్తాయనే నమ్మకం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ రోజు చంద్రుడు భూమికి సుమారు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో పీక్ వచ్చింది. కొత్త సంవత్సరం మొదట్లోనే సూపర్ మూన్ రావడం వల్ల ఇది చాలా ప్రత్యేకతను సంతరించుకుంది.

*నవంబర్ 24న రెండో సూపర్ మూన్ వస్తుంది. ఇది కూడా "బీవర్ మూన్". ఇది 2026లో మధ్యలో వచ్చే సూపర్ మూన్. దీనికి వెంటనే డిసెంబర్‌లో మరో సూపర్ మూన్ రావడం విశేషం.

*డిసెంబర్ 24న మూడవ మరియు చివరి సూపర్ మూన్ వస్తుంది. ఇది "కోల్డ్ మూన్". ఈ రోజు చంద్రుడు భూమికి సుమారు 3,56,500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 2026లో అతి దగ్గరి సూపర్ మూన్. క్రిస్మస్ ఈవ్ రోజున రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

నిజాలు - అపోహలు

సూపర్ మూన్ వచ్చినప్పుడు సముద్రంలో అలలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కొందరు సూపర్ మూన్ వల్ల భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు జరుగుతాయని నమ్ముతారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం సూపర్ మూన్‌కు భూకంపాలకు నేరుగా సంబంధం ఉందని ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవని చెబుతారు. ఇది ఎక్కువగా ఒక ఖగోళ దృశ్యమే, మనకు కనిపించే విధానంలో వచ్చే మార్పు మాత్రమే.

Next Story