Women's Day / Viral : పామును నమ్ము అమ్మాయిని కాదు! స్త్రీలపై విద్వేషం చిమ్ముతున్న వింత ధోరణి!!

by Javid Pasha |   (  Updated:2026-03-06 10:27:11  IST  )

సెక్సిస్ట్ ఆలోచనలు, సందేశాలు, తరతరాలుగా స్త్రీని వస్తువుగా, బానిసగా, బలహీనురాలిగా, బాధితురాలిగా, నేరస్థురాలిగా ముద్రవేస్తూ వచ్చాయంటున్నారు ఫెమినిస్టులు.

Womens Day / Viral : పామును నమ్ము అమ్మాయిని కాదు! స్త్రీలపై విద్వేషం చిమ్ముతున్న వింత ధోరణి!!
X

దిశ, ఫీచర్స్ : మీరు తరచుగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారైతే గనుక బహుశా ఇది చూసే ఉంటారు. ‘‘Believe a snake, but not a girl’’ అనే కొటేషన్ ఒకటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనంలో రాసి ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. వుమెన్స్ డే నేపథ్యంలో మరోసారి వైరల్ అవుతూ చర్చకు దారితీస్తోంది. ‘పామునైనా నమ్మండి కానీ.. అమ్మాయిని నమ్మకండి’ అని రాసింది ఒక తుంటరి వ్యక్తి కావచ్చు. లేదా స్త్రీలపట్ల ద్వేషం పెంచుకున్న వ్యక్తి కావచ్చు. కానీ ఇప్పటికీ కొనసాగుతున్న పురుషాధిక్య సమాజానికి ఇది అద్దం పడుతోందని, స్త్రీలపట్ల ద్వేషం, చులకన, అణచివేత భావజాలాన్ని ప్రతిబింబిస్తున్నదని స్త్రీవాదులు అంటున్నారు.

స్త్రీ వ్యతిరేక దృక్పథం వెనుక..

అమ్మాయిని లేదా ఒక స్త్రీని విషపూరితమైన పాముతో పోల్చుతూ కొటేషన్ రూపంలో ద్వేషాన్ని వెళ్లగక్కడం అనేది కొందరికి చిన్న విషయంగానూ అనిపిస్తుండవచ్చు. కానీ ఈ సెక్సిస్ట్ (స్త్రీ వ్యతిరేక) ఆలోచలు లేదా సందేశాలు, తరతరాలుగా మన సమాజం స్త్రీని ఒక వస్తువుగా, బానిసగా, బలహీనురాలిగా, బాధితురాలిగా, చేయని పొరపాట్లకు నేరస్థురాలిగా ఎలా ముద్రవేస్తూ వచ్చిందో గుర్తుకు చేస్తున్నదని ఫెమినిస్టులు అంటున్నారు. తప్పును తప్పుగా చూడటం వేరు. తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఒక తరగతిని లేదా ఒక జాతిని, ఒక సమూహాన్ని టార్గెట్ చేయడం వేరు. ఇక్కడ ‘పామునైనా నమ్మండి కానీ అమ్మాయిని నమ్మకండి’ అనే కొటేషన్ కూడా ఇదే కోవకు చెందుతుందని, మొత్తం అమ్మాయిలను లేదా స్త్రీలను ద్వేషించేలా ప్రేరేపిస్తున్నదని, స్త్రీలంటే తప్పుడు వ్యక్తులుగా, మోసం చేసేవారిగా ఆరోపిస్తూ నేరాన్ని అంటగట్టడమే దీని ఉద్దేశం అని స్త్రీ వాదులు అంటున్నారు.

కొందరికే పరిమితమా?

తప్పులు లేదా పొరపాట్లు అందరూ చేస్తారు. అవి కేవలం అమ్మాయిలకో, కేవలం అబ్బాయిలకో పరిమితం కాదు. ఎవరు తప్పుచేస్తే వారిని తప్పుబట్టడం, ఎవరి వల్ల ఇబ్బంది కలిగితే ఆ వ్యక్తి వరకు మాత్రమే దానిని పరిగణించడం, పరిమితం చేయడం, పరిష్కారం వెతకడం అనేది విజ్ఞత, విచక్షణ జ్ఞానంగల మనుషులు, వ్యవస్థలు చేసేపని. కానీ ఒక స్త్రీ పొరపాటు చేస్తే మొత్తం స్త్రీ జాతి పొరపాటు చేసినట్లు, ఒక వ్యక్తి పొరపాటు చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం సమూహం తప్పుచేసినట్లు భావించడం, ద్వేషించడం, విద్వేషాన్ని నింపేలా ప్రవర్తించడం, ప్రచారం చేయడమే ఇక్కడ అసలు సమస్య. ఒకవైపు ఆధునిక, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ మరోవైపు ఇలాంటి విద్వేష ప్రచారాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. టాక్సిక్ భావాలను నాటుతున్నాయి. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఇప్పటికీ జరుగుతోంది.

విజ్ఞతతో విద్వేషాలకు చెక్

ఒకప్పటితో పోలిస్తే చాలా మార్పు వచ్చినప్పటికీ.. ఏదో ఒక రూపంలో స్త్రీలపట్ల వివక్ష, ద్వేషం, చులక భావం వేళ్లూనుకుపోయి ఉన్నాయని, ‘‘Believe a snake, but not a girl’’ అనే కొటేషనే దానికి చక్కటి ఉదాహరణ అని స్త్రీ వాదులు అంటున్నారు. మన చుట్టూ సమాజంలో జరిగే అనేక సంఘటనలు, ప్రచారాలు కూడా ఇందుకు అద్దం పడుతుంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా బస్సులు, ఆటోలు, ట్రక్కులు, పలు ఇతర వాహనాలు, బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ప్లేస్‌లలో సెక్సిస్ట్ జోక్‌లు, కొటేషన్లు లింగ వివక్షతను నార్మలైజ్ చేస్తాయని, మహిళలను సమాజ వ్యతిరేకులనే తప్పుడు భావనకు దారితీస్తాయని ఫెమినిస్టులు అంటున్నారు. విజ్ఞత గల వ్యక్తులు, వ్యవస్థలు ఇలాంటి విద్వేషపు భావాలను, ప్రచారాలను వ్యతిరేకించాల్సిన అవసరం చెబుతున్నారు. Link

Next Story