ఆకట్టుకుంటున్న ‘మే పుష్పం’.. ఏడాదికి పూసేది ఒక పువ్వు మాత్రమే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-17 10:05:33  IST  )

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఏడాదికి ఒక్కసారే పూసే అరుదైన 'మే పుష్పం' వికసించింది.

ఆకట్టుకుంటున్న ‘మే పుష్పం’.. ఏడాదికి పూసేది ఒక పువ్వు మాత్రమే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతి సృష్టిలో కొన్ని వింతలు, విశేషాలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఓ అద్భుతమే ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో అందరినీ ఆకట్టుకుంటోంది. కేసముద్రం మండల కేంద్రంలోని ఓ ఇంటి ఆవరణలో వికసించిన ‘మే పుష్పం’ (May Flower) ఇప్పుడు స్థానికంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఏడాదికి కేవలం ఒక్కసారి మాత్రమే పూసే ఈ పువ్వును చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. శాస్త్రీయంగా స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ (Scadoxus Multiflorus) అని పిలిచే ఈ మొక్కను సాధారణంగా ‘బ్లడ్ లిల్లీ’ అని అంటారు. ఇది ఆఫ్రికా ఖండానికి చెందిన అరుదైన జాతి మొక్క అయినప్పటికీ, మన వాతావరణంలోనూ అద్భుతంగా పెరుగుతుంది. తీవ్రమైన ఎండలు ఉండే ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ఇది వికసిస్తుండటంతో దీనికి ‘మే’ పుష్పం అనే పేరు వచ్చింది. ఈ మొక్కకు ఓ విచిత్రమైన లక్షణం ఉందండోయ్. సాధారణంగా మొక్కలకు ఆకులు వచ్చిన తర్వాత పువ్వులు పూస్తాయి. కానీ, ఈ మే పుష్పానికి ఆకులు రాకముందే, నేరుగా భూమిలో ఉన్న దుంప (Bulb) నుండి కాడలు పైకి వస్తాయి. పైకి వచ్చిన కాడల చివర వందలాది చిన్న చిన్న పువ్వులు గుత్తులుగా వికసించి, చూడటానికి గుండ్రని ఫుట్‌బాల్ ఆకారంలో మెరిసిపోతాయి. ముదురు గులాబీ, ఎరుపు (Blood Red) రంగులో ఉండే ఈ పువ్వులు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి.

వేసవిలోనే ఎందుకు పూస్తుందంటే..

బ్లడ్ లిల్లీ మొక్క భూమి లోపల ఉండే దుంప రూపంలో శీతాకాలం అంతా రెస్ట్ తీసుకుంటుంది. వేసవి కాలం రాగానే, భూమిలోని వేడికి ఇది మేల్కొని కేవలం మే నెలలో మాత్రమే పూస్తుంది. ఆ తర్వాత పువ్వు రాలిపోయాక మొక్కకు ఆకులు రావడం ప్రారంభిస్తాయి. ఏడాది పొడవునా రాని ఈ అందం, కేవలం వేసవి కాలంలో కొన్ని రోజులు మాత్రమే కనువిందు చేస్తుండటంతో కేసముద్రంలోని ఆ ఇంటి ఆవరణకు స్థానికులు క్యూ కడుతున్నారు. ఈ అరుదైన బ్లడ్ లిల్లీ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్‌గా అవుతున్నాయి.

Next Story