- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణాలతో చలగాటమాడిన ట్యాక్సీ డ్రైవర్.. వ్యక్తిని ఢీకొట్టి బోనెట్‌పై 2 కి.మీ ఈడ్చుకెళ్లిన వైనం
హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో ‘హిట్ అండ్ రన్ కేసు’లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ కారుతో ఢీకొట్టడమే కాకుండా, ప్రశ్నించిన బాధితుడిని ఏకంగా 3 కిలోమీటర్ల మేర కారు బోనెట్‌పై ఈడ్చుకెళ్లి రాక్షసత్వం ప్రదర్శించాడు. మీర్‌పేట్ (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎస్.కె. జిలానీ (SK Jilani) అతడి కొడుకు ఫైసల్ (Faisal) కలిసి గాయత్రి నగర్ నుంచి ఎల్‌బీ నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, ఓ టాక్సీ కారు వెనుక నుంచి వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు కిందపడిపోయారు. ప్రమాదంపై జిలానీ డ్రైవర్‌ను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. గొడవ పెద్దదవ్వడంతో కారులో ఉన్న వ్యక్తి జిలానీపై దాడికి కూడా పాల్పడ్డాడు.
బోనెట్‌పై ఉండగానే 2 కిలోమీటర్లు..
బైక్‌ను ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, జిలానీ కారుకు అడ్డంగా నిలబడి ఆపాలని చూశాడు. అయితే, ఉన్మాదిలా మారిన డ్రైవర్ ఏమాత్రం కనికరం లేకుండా కారును ముందుకు పోనిచ్చాడు. ప్రాణభయంతో జిలానీ కారు బోనెట్‌ను గట్టిగా పట్టుకుని వేలాడాడు. అతడు గాయాలతో నొప్పితో అరుస్తున్నా పట్టించుకోని డ్రైవర్, జిలానీని అలాగే బోనెట్‌పై ఉంచి దాదాపు 2 కి.మీ మేర ఈడ్చుకెళ్లాడు. ఆ కారు బాలాపూర్ (Balapur) క్రాస్‌రోడ్స్ వరకు వేగంగా వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగింది. ఇతర వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. కొందరు ఈ దారుణాన్ని వీడియో తీయగా.. మరికొందరు వెంబడించి చివరకు మంద మల్లమ్మ జంక్షన్ సమీపంలో కారును అడ్డగించి నిందితుడిని పట్టుకున్నారు.
ఆసుపత్రిలో కుమారుడు
ఈ ఘటనలో జిలానీ తీవ్రంగా గాయపడగా.. అతడి కుమారుడు ఫైసల్‌కు చెందిన రెండు కాళ్లు విరిగిపోయాయి. ప్రస్తుతం ఫైసల్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.






