నగరంలోని ప్రముఖ హోటల్‌లో దారుణం.. బిర్యానీలో గుట్కా ప్యాకెట్ ప్రత్యక్షం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-01 12:16:20  IST  )

నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీలో గుట్కా ప్యాకెట్లు ప్రత్యక్ష్యం అవ్వడం కలకలం రేపుతోంది.

నగరంలోని ప్రముఖ హోటల్‌లో దారుణం.. బిర్యానీలో గుట్కా ప్యాకెట్ ప్రత్యక్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో బయట రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనం చేయాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కానీ, తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకు మనం పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేస్తూ బయట తినాల్సి వస్తే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అచ్చం అలాంటి ఘటనే నగరంలోని మియాపూర్‌ (Miyapur) పరిధిలో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్‌ (Kinara Grand Hotel)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ కస్టమర్ ఇవాళ మియాపూర్‌లోని కిన్నెర గ్రాండ్ హోటల్‌కు వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఎంతో ఇష్టంగా బిర్యానీ తింటున్న క్రమంలో, అతనికి ఏదో వింత రుచి తగిలింది. తీరా చూస్తే, బిర్యానీలో ఒక గుట్కా ప్యాకెట్ ఉంది. అప్పటికే సదరు కస్టమర్ బిర్యానీతో పాటు తెలియకుండా ఒక గుట్కా ప్యాకెట్‌ను తినేశారు.

ప్లేట్‌లో మరో ప్యాకెట్.. కస్టమర్ షాక్

తొలి ప్యాకెట్ చూసి నోటిలోని ముద్దను ఊసేసిన కస్టమర్, ప్లేట్‌ను పరిశీలించగా అందులో మరో గుట్కా ప్యాకెట్ కూడా కనిపించింది. దీంతో సదరు కస్టమర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. తన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే తమ తప్పును సరిదిద్దుకోవాల్సిన యాజమాన్యం.. బాధితుడికి పొంతన లేని సమాధానాలు చెబుతూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. హైదరాబాద్‌ వంటి నగరంలో పేరున్న హోటళ్లలో కూడా ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Officers) వెంటనే స్పందించి, ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story