ఫీజు కట్టలేదని ప్రైవేటు స్కూల్ దాష్టీకం.. 5 గంటల పాటు LKG స్టూడెంట్ నిర్బంధం

by Kema Shiva Kumar |

పశ్చిమగోదావరి జిల్లా రంగమ్మన్నారుపేట సన్ షైన్ స్కూల్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

ఫీజు కట్టలేదని ప్రైవేటు స్కూల్ దాష్టీకం.. 5 గంటల పాటు LKG స్టూడెంట్ నిర్బంధం
X

దిశ, వెబ్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా ఫీజు బకాయి ఉందన్న సాకుతో ఓ చిన్నారిని గదిలో బంధించిన అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. రంగమ్మన్నారుపేట (Rangamannarupeta)లో ఉన్న ‘సన్ షైన్ స్కూల్’ (Sunshine School)లో ఓ చిన్నారి మౌనిక ఎల్‌కేజీ చదువుతోంది. సదరు పాపకు సంబంధించిన స్కూల్ ఫీజు కొంత బకాయి ఉండటంతో, యాజమాన్యం కనికరం లేకుండా ప్రవర్తించింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఏకంగా 5 గంటల పాటు ఒక గదిలో నిర్బంధించింది.

మానవత్వం మరచిన యాజమాన్యం..

కనీసం ఎల్‌కేజీ చదివే పాప అని కూడా చూడకుండా, ఏడుస్తున్నా పట్టించుకోకుండా గదిలో వేసి తాళం వేయడం స్థానికంగా కలకలం రేపింది. పాఠశాల సమయం ముగిసినా పాప ఇంటికి రాకపోవడం, స్కూల్ వద్ద ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఫీజు విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడాలి కానీ, ఇలా పసిపాపను బంధించడం ఏంటని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చదువు నేర్పించమని పంపిస్తే.. నా బిడ్డను జైల్లో పెట్టినట్టు పెడతారా?’ అని ఆ పాప తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టాలను తుంగలో తొక్కి, చిన్నారిపై మానసిక దాడికి పాల్పడిన సన్ షైన్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story