Viral : మన సివిక్ సెన్స్! ప్రారంభం రోజే ‘వందే భారత్’ స్లీపర్ కోచ్‌లో చెత్తాచెదారం

by Ramesh Naini |

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మాల్దాలో జెండా ఊపి ప్రారంభించిన ఈ రైలు, ప్రయాణం మొదలైన కొద్ది గంటల్లోనే చెత్తకుప్పలా మార్చేశారు కొందరు ప్రయాణికులు..

Viral : మన సివిక్ సెన్స్! ప్రారంభం రోజే ‘వందే భారత్’ స్లీపర్ కోచ్‌లో చెత్తాచెదారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అత్యాధునిక ‘వందే భారత్ స్లీపర్’ రైలు పట్టాలెక్కిన తొలిరోజే అపశృతి చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మాల్దాలో జెండా ఊపి ప్రారంభించిన ఈ రైలు, ప్రయాణం మొదలైన కొద్ది గంటల్లోనే చెత్తకుప్పలా మార్చేశారు కొందరు ప్రయాణికులు.. హౌరా-గౌహతి మధ్య నడిచే ఈ ప్రీమియం ఏసీ స్లీపర్ రైలులో పలువురు ప్రయాణికులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతుంది. కోట్లాది రూపాయల ఖర్చుతో, ప్రపంచ స్థాయి హంగులతో సిద్ధం చేసిన ఈ రైలు కోచ్‌లలో ప్లాస్టిక్ ఆహార ప్యాకెట్లు, వాడి పారేసిన చెంచాలు (spoons), ఐస్ క్రీమ్ కప్పులు వంటి ఇతర చెత్తాచెదారం కింద పడి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఓ ప్రయాణికుడు రికార్డు చేసిన ఈ వీడియోలో.. తళతళలాడే కొత్త రైలు సీట్లు కనిపిస్తుండగా, కెమెరా కిందకు తిప్పగానే ఫ్లోర్ అంతా చెత్తతో నిండిపోయి దర్శనమిచ్చింది.

ప్రభుత్వం తప్పా? మన తప్పా?

వీడియో తీసిన వ్యక్తి ప్రయాణికుల కనీస సివిక్ సెన్స్ (Civic Sense)ను నిలదీశారు. ‘ఇది చూడండి.. ఇది రైల్వే తప్పా? ప్రభుత్వం తప్పా? లేక మన తప్పా? మీరే చెప్పండి. మన సివిక్ సెన్స్ ఏంటో దీన్ని చూస్తే అర్థమవుతుంది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా సౌకర్యాలు లేవంటూ ప్రభుత్వాలను నిందించే ప్రజలు, ఉన్న సౌకర్యాలను కాపాడుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారన్న చర్చకు ఈ వీడియో తెరలేపింది.

చదువుకున్నా ప్రయోజనం లేదు..!

ఇక, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్ కొనగలరు కానీ, సంస్కారాన్ని కొనలేరని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. ‘చదువుకున్నా ప్రయోజనం లేదు.. వీళ్లను 'చదువుకున్న మూర్ఖులు' (Padhe likhe gawar) అనాలని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. నిజంగా మనకు మంచి సౌకర్యాలు పొందే అర్హత లేదంటూ నెటిజన్‌లు ఘాటుగా స్పందిస్తున్నారు. కాగా, 16 కోచ్‌లతో పూర్తిగా ఏసీ సౌకర్యం కలిగిన ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు విమాన ప్రయాణ అనుభూతిని పంచేలా రూపొందించారు. కానీ, ప్రారంభోత్సవం రోజే ఇలాంటి దృశ్యాలు కనిపించడం విచారకరం.

Next Story