వస్తువులు కావు.. ప్రాణం ఉన్న జీవులు: 3 కుక్కల కస్టడీ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

by Kema Shiva Kumar |

ఢిల్లీ హైకోర్టు పెంపుడు జంతువుల కస్టడీపై మానవీయ కోణంలో సంచలన తీర్పును వెలువరించింది.

వస్తువులు కావు.. ప్రాణం ఉన్న జీవులు: 3 కుక్కల కస్టడీ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: చట్టం అంటే కేవలం సెక్షన్లు మాత్రమే కాదని, మూగ మనసుల వేదనను అర్థం చేసుకునే మానవత్వం కూడా అని ఢిల్లీ హైకోర్టు (Dehli High Court) నిరూపించింది. పెంపుడు జంతువుల కస్టడీకి సంబంధించి ధర్మాసనం ఓ అరుదైన తీర్పును వెలువరించింది. పెంపుడు జంతువును దత్తత తీసుకున్న వ్యక్తికి, ఆ మూగజీవానికి మధ్య ఏర్పడే భావోద్వేగ బంధాన్ని ఎవరూ విస్మరించలేరు అని కోర్టు స్పష్టం చేసింది. మిష్టి, కోకో, కాటన్ అనే మూడు ‘టాయ్ పోమెరేనియన్’ (Toy Pomeranian) కుక్కల కస్టడీని వాటిని సంరక్షిస్తున్న దత్తత తల్లిదండ్రులకే అప్పగిస్తూ జస్టిస్ గిరీష్ కట్పాలియా ఆదేశాలు జారీ చేశారు.

అసలు ఏం జరిగిందంటే..?

ఓ యజమాని తన పెంపుడు కుక్కలను అత్యంత దయనీయ స్థితిలో ఉంచాడన్న ఆరోపణలతో మొదలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ కుక్కలను రక్షించి ఒక ఎన్జీవోకు అప్పగించారు. ఆ తర్వాత పిటిషనర్లు ఆ కుక్కలను దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే, కుక్కల అసలు యజమాని ట్రయల్ కోర్టును ఆశ్రయించి, తన కుక్కలను తనకు అప్పగించాలని కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. అయితే, ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దత్తత తీసుకున్న వారు హైకోర్టును ఆశ్రయించారు.

వాటిని వస్తువులతో పోల్చలేం కదా..

విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గిరీష్ కథ్పాలియా (Girish Kathpalia) కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షించబడిన జంతువుల కస్టడీని ప్రాణం లేని వస్తువులతో పోల్చలేమని స్పష్టం చేశారు. దత్తత తీసుకున్న వారి నుంచి ఆ మూగజీవాలను వేరు చేస్తే అవి తీవ్రమైన మానసిక వేదనకు (Emotional Trauma) గురవుతాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మిష్టి, కోకో, కాటన్ అనే మూడు కుక్కలు.. పిటిషనర్లు పెట్టిన పేర్లతో పిలవగానే గుర్తుపట్టి స్పందిస్తున్నాయని, ఇది వాటి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనమని ధర్మాసనం గుర్తించింది. కుక్కల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, అసలు యజమాని కూడా వాటిని పిటిషనర్ల వద్దే ఉంచేందుకు కోర్టులో అంగీకరించారు. అయితే, ట్రయల్ కోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను హైకోర్టు సవరిస్తూ.. శుక్రవారం లోపు కుక్కలను పిటిషనర్లకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు ఒక్కో కుక్కకు రూ.50,000 చొప్పున బాండ్ సమర్పించాలని, కోర్టు ఆదేశించినప్పుడు వాటిని ప్రవేశపెట్టాలని షరతు విధించింది.

Next Story