చర్చనీయాంశంగా కొత్త నోట్లు.. బ్యాంకుల్లో కాదు, వీధుల్లోనే మార్పు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-11 14:16:34  IST  )

ప్రతి దేశానికి సొంత కరెన్సీ, ఆ దేశ సంస్కృతిని తెలియజేసేలా ఆ నోట్ల ముద్రణ ఉంటుందని మనందరికి తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ కరెన్సీ నోట్ల ముద్రణలో కాలానుగుణంగా మార్పులు జరుగుతుంటాయి.

చర్చనీయాంశంగా కొత్త నోట్లు.. బ్యాంకుల్లో కాదు, వీధుల్లోనే మార్పు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి దేశానికి సొంత కరెన్సీ (Currency), ఆ దేశ సంస్కృతి, పూర్వ వైభవాన్ని ప్రతిబింబించేలా ఆ నోట్లు ముద్రితమవుతుంటాయి. ఇక దేశ ఆర్థిక పరిస్థితులు, పాలనా మార్పులు, ప్రజాభిప్రాయాలను బట్టి కాలానుగుణంగా కరెన్సీ రూపం మారుతుంటుంది. ఈ నేపథ్యంలో మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ తాజాగా కొత్త రూపంలో కరెన్సీ నోట్లను విడుదల చేసింది. మాజీ ప్రధాని, బంగ్లా జాతిపిత ముజిబుర్ రెహమాన్ (Mujibur Rahman) స్థానంలో దేశ సంస్కృతి, చారిత్రక భవనాలు, కళాత్మకతను ప్రతిబింబించేలా కొత్త నోట్లను రూపొందించింది. ఇక మొత్తం మూడు డినామినేషన్లతో రూ.1,000, రూ.50, రూ.20 నోట్లను విడుదల చేసిన బంగ్లా ప్రభుత్వం.. జూన్ 1 నుంచి అధికారికంగా చలామణిలోకి తీసుకొచ్చింది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంది. అసలు విషయం ఏమిటంటే..

సాధారణంగా నోట్ల మార్పిడి అనగానే.. ప్రజలు బ్యాంకులకు వెళ్లి క్యూకట్టి మరీ పాత నోట్లు ఇచ్చి కొత్తవి తీసుకుంటారు. కానీ బంగ్లాదేశ్‌లో అలా జరగలేదు! బంగ్లా ప్రజలు కొత్త నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవటం లేదు, వీధుల్లోనే మార్చుకుంటున్నారు. ఇదెక్కడి వింత అనుకుంటున్నారా! ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో నోట్ల కోసం రోడ్డుపై వ్యాపారులు పెట్టిన డెస్కులు, బండ్లు, చేతిలో బండిల్స్‌తో కొనుగోలు చేస్తున్న ప్రజలు కనిపిస్తున్నారు.

ప్రజలు బ్యాంకుల్లో ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం, ఏటీఎంలలో కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు ఈ బాటపట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఇలా చేయటం వల్ల బ్లాక్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఇది నిజంగా కొత్త ధోరణి.. బ్యాంకులు లేకుండానే కరెన్సీ మార్పిడి జరగడం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది!' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story