పనిమనిషికి ‘ఎయిర్ కూలర్’ సర్ ప్రైజ్.. ఆనందంతో ఆమె ఇచ్చిన రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా!

by Ramesh Naini |

మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ కుటుంబం తమ ఇంట్లో పనిచేసే మహిళకు ఎయిర్ కూలర్‌ను కానుకగా ఇచ్చింది.

పనిమనిషికి ‘ఎయిర్ కూలర్’ సర్ ప్రైజ్.. ఆనందంతో ఆమె ఇచ్చిన రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ కుటుంబం తమ ఇంట్లో పనిచేసే మహిళకు ఎయిర్ కూలర్‌ను కానుకగా ఇచ్చింది. ఆ బహుమతిని చూసి ఆనందంతో ఆమె ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ చిన్న వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

వీడియోలో ఏముందంటే..

వంటగదిలో పని చేసుకుంటున్న ఆ మహిళను ఆమె యజమాని పిలిచి.. ‘అక్కా.. నీకోసం ఒకటి తెచ్చాను’ అని చెబుతుంది. ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లగా, అక్కడ ప్యాక్ చేసి ఉన్న ఓ పెద్ద గిఫ్ట్ కనిపిస్తుంది. అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఆమె అడగ్గా.. అది ‘ఎయిర్ కూలర్’ అని యజమాని చెబుతుంది. అంతే.. ఆ మాట వినగానే ఆమె ఆనందంతో ఆశ్చర్యానికి గురవుతుంది. సంతోషంతో వెంటనే తన యజమానిని రెండు మూడు సార్లు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటుంది.

వైరల్ అవుతున్న వీడియో

@lifeofcocoandchico అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు కేవలం ఒక్కరోజులోనే 1.8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నిజానికి ఈ పేజీలో ఆ కుటుంబం పెంచుకునే రెండు 'షిహ్ ట్జు' (Shih Tzus) జాతి శునకాల వీడియోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. కానీ, దానికి భిన్నంగా పోస్ట్ చేసిన ఈ హృద్యమైన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘మా కుక్కలను, మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకునే మా పనిమనిషిని మేము కూడా అలాగే జాగ్రత్తగా చూసుకుంటాం’ అని ఆ వీడియోలో రాసి ఉన్న క్యాప్షన్ వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోంది.

హృదయాలను హత్తుకునే కామెంట్లు

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుటుంబం చేసిన పనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇండియాలో ఉన్న ఎండల తీవ్రత దృష్ట్యా వారు ఇచ్చిన ఈ బహుమతి ఎంతో గొప్పది’ అని మరికొందరు అభినందిస్తున్నారు. మనం చూపించే చిన్నపాటి ప్రేమానురాగాలు ఇతరుల జీవితాల్లో ఎంతటి సంతోషాన్ని నింపుతాయో చెప్పడానికి ఈ వీడియోనే ఒక ఉత్తమ ఉదాహరణ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Next Story