జెఫ్రీ ఎప్‌స్టీన్ ‘సూసైడ్ నోట్’ విడుదల.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-07 04:10:08  IST  )

లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకునే ముందు రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను ఎట్టకేలకు అన్‌సీల్ చేశారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్ ‘సూసైడ్ నోట్’ విడుదల.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి
X

దిశ, వెబ్‌డెస్క్: మాన్‌హట్టన్ జైలు గదిలో లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) మరణించిన ఐదేళ్ల తర్వాత ఆయన రాసినట్లుగా చెబుతున్న ఓ పసుపు రంగు లీగల్ ప్యాడ్ నోట్‌ను బహిర్గతం చేయాలని యూఎస్ జిల్లా జడ్జి కెన్నెత్ కరాస్ (Kenneth Karas) ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు తాజాగా ఆ నోట్‌‌ను అన్‌సీల్ (Unseal) చేశారు. అయితే, సూసైడ్‌ నోట్‌లో ఎప్‌స్టీన్ తనపై ఉన్న ఆరోపణలు, తన అప్పటి ప్రస్తుత స్థితి గురించి వివరించారు. తనపై పోలీసులు నెలల తరబడి దర్యాప్తు చేశారని.. అయినా వారికి ఏమీ దొరకలేదని నోట్‌లో పేర్కొన్నారు. ‘వీడ్కోలు చెప్పడానికి సమయాన్ని ఎంచుకోగలగడం ఒక వరం’ అని అందులో రాశారు. ‘నేనేం చేయాలని కోరుకుంటున్నారు - ఏడవాలా! ఇది సరదా కాదు.. దీనికి విలువ లేదు’ అని అందులో ఎప్‌స్టీన్ రాసినట్లుగా ఉంది.

ఆ సూసైడ్ నోట్ ఎక్కడ దొరికిందంటే..

జెఫ్రీ ఎప్‌స్టీన్ రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్‌ను మాజీ సెల్‌మేట్, మాజీ పోలీసు అధికారి నికోలస్ టార్టాగ్లియోన్ (Nicholas Tartaglione) కనుగొన్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న గదిలోని ఓ పుస్తకంలో ఈ నోట్ దాచి ఉంచినట్లుగా టార్టాగ్లియోన్ తెలిపారు. జూలై 23, 2019న ఎప్‌స్టీన్ మొదటిసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు భావిస్తున్న ఘటన తర్వాత ఆ నోట్ వెలుగులోకి వచ్చింది. ఆ ఉదంతం జరిగిని తర్వాత ఎప్‌స్టీన్‌ను 31 గంటల పాటు ‘సూసైడ్ వాచ్‌’లో పెట్టారు. ఆగస్టు 10, 2019న మాన్‌హట్టన్‌లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్‌లో ఎప్‌స్టీన్ మరణించారు. ఆ సమయంలో జైలు సిబ్బంది పర్యవేక్షణలో విఫలమయ్యారని అధికారులు గుర్తించారు. ఎప్‌స్టీన్ మరణం తర్వాత ఆయన గదిలో జైలు ఆహారం, స్నానపు గదిలో పురుగుల గురించి ఫిర్యాదులతో కూడిన మరో నోట్ కూడా లభించిన విషయం తెలిసిందే.

Next Story