మ్యూజియంలో ఘోరం.. ఫొటో కోసం 300 ఏళ్ల నాటి కళాఖండాన్ని ఏం చేశాడో చూడండి!

by Yella Dhawani Reddy |

గడిచిన కాలం నాటి చరిత్రను భవిష్యత్తు తరాలకు సాక్ష్యాలు మ్యూజియాల్లో ప్రదర్శించే పురాతన వస్తువులు నిలుస్తాయి.

మ్యూజియంలో ఘోరం.. ఫొటో కోసం 300 ఏళ్ల నాటి కళాఖండాన్ని ఏం చేశాడో చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్: గడిచిన కాలం నాటి చరిత్రను భవిష్యత్తు తరాలకు సాక్ష్యాలు మ్యూజియాల్లో ప్రదర్శించే పురాతన వస్తువులు నిలుస్తాయి. రాజుల చేతుల్లో మెరిసిన ఖడ్గాలు, శతాబ్దాలనాటి నాణేలు, శిలాలపై చెక్కిన శాసనాలు, కళాకారుల చేతుల్లో పుట్టిన చిత్రాలు.. ఇవన్నీ గడిచిన యుగాల జ్ఞాపకాలను మన కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాయి. ప్రతి వస్తువూ ఒక కథ చెబుతుంది, ఒక రాజవంశాన్ని, ఒక యుద్ధాన్ని, ఒక సంస్కృతి పరంపరను తెలియజేస్తోంది. ఇవి కేవలం చూసే వస్తువులు మాత్రమే కాదు.. నాటి మన చరిత్రకు నిదర్శనాలు. అయితే, అలాంటి విలువైన చరిత్ర భాగాలను ప్రదర్శించిన చోట, ఒక ఫోటో కోసం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎంతటి ఘోరం జరుగుతుందో ప్రస్తుత ఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. అసలేం జరిగిందంటే?

ఇటలీలోని (Italy) ఫ్లోరెన్స్ నగరంలో ప్రసిద్ధ ఉఫిజ్జీ గ్యాలరీ (Uffizi Gallery)లో చోటుచేసుకున్న ఈ ఘటన కళాభిమానులను తీవ్రంగా కలచివేసింది. 300 ఏళ్ల నాటి పాత చిత్రపటానికి ఒక సందర్శకుడు ప్రమాదవశాత్తు నష్టం కలిగించాడు. వివరాల్లోకి వెళితే.. మ్యూజియంలో సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడ ప్రదర్శనకు పెట్టిన చిత్రపటం ముందు ఫొటో తీసుకునేందుకు నిలబడ్డాడు. ఫొటో సరిగా రావాట్లేదనుకున్నాడేమో ఒక్కసారిగా వెనక్కి వాలడంతో ఆయన వెనుక ఉన్న చిత్రానికి ఢీకొన్నాడు. 1712లో కళాకారుడు అంటోన్ డొమెనికో గబ్బియాని చిత్రించిన టస్కన్ యువరాజు ఫెర్డినాండో డే మెడిసీ చిత్రం అది. ఈ ఘటనలో ఆ చిత్రం పగిలిపోయింది. సెక్యూరిటీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అవ్వటంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ విషయంపై మ్యూజియం డైరెక్టర్ సిమోనె వేర్‌డె తీవ్రంగా స్పందించారు. 'ఇది యాదృచ్ఛిక సంఘటన కాదు. సోషల్ మీడియా కోసం వస్తున్న సందర్శకుల బాధ్యతారాహిత్యమే దీనికి కారణం' అని తెలిపారు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు, మ్యూజియం అధికారులు కొత్త నిబంధనలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఆ సందర్శకుడిని ఇప్పటికే పోలీసులు గుర్తించి, న్యాయసంస్థలకు అప్పగించినట్లు సమాచారం. కాగా, ఇటీవల వాన్ గాగ్ ప్రదర్శనలో భాగమైన ఓ అరుదైన చైర్‌లో ఓ పర్యాటకుడు కూర్చునేందుకు ప్రయత్నించగా విరిగిపోయిన విషయం తెలిసిందే.


Next Story