అన్నం పెట్టమంటే కోడళ్ల చెప్పు దెబ్బలు.. కలెక్టరేట్‌లో వృద్ధ దంపతుల ఆవేదన

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-10 12:56:11  IST  )

కలియుగంలో మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి.

అన్నం పెట్టమంటే కోడళ్ల చెప్పు దెబ్బలు.. కలెక్టరేట్‌లో వృద్ధ దంపతుల ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగంలో మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. జన్మనిచ్చి, పెంచి పోషించి, విద్యా బుద్ధులు చెప్పించి ప్రయోజకులైన కొడుకులకు కన్నోళ్లే భారమయ్యారు. వయసు మీద పడి బుక్కెడు బువ్వ పెట్టమని అడిగిన పాపానికి వారిచ్చిన సమాధానం చెప్పు దెబ్బలు. వివరాల్లోకి వెళితే.. హన్మకొండ (Hanmakonda) జిల్లా పరకాల మండలం పరిధిలోని సీతారాంపూర్ (Seetharampur) గ్రామానికి చెందిన కొమురమ్మ, సమ్మయ్య దంపతులుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఇటీవలే ఇద్దరు కొడుకులకు ఆస్తి పంపకాలు కూడా చేశారు.

ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆస్తి చేతికొచ్చాక కొడుకులు, కోడళ్లు ఒక్కటయ్యారు. కోడళ్లను అన్నం పెట్టాలని అడగ్గా.. నిత్యం చెప్పుతో కొట్టడం.. నోటికొచ్చినట్లుగా బూతులు మాట్లాడుతున్నారని ఆ వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇరుగు పొరుగు వారితో పాటు గ్రామస్థులకు విషయం చెప్పినా.. కోడళ్ల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక చేసేదేమి లేక ఆ వృద్ధ దంపతులు ఇవాళ హన్మకొండలోని కలెక్టరేట్‌‌లో ఫిర్యాదు చేశారు. ఆస్తి పంచిన తర్వాత కూడా తమకు బుక్కెడన్నం పెట్టడం లేదని.. అన్నం పెట్టమంటే కోడళ్లు చెప్పులతో కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పట్టించుకోని వాళ్లకు ఆస్తులు ఎందుకు ఇవ్వాలని.. తాము రాసిచ్చిన ఆస్తి తమకు వెంటనే ఇప్పించాలంటూ ఆ వృద్ధ దంపతులు విలపిస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం అక్కడున్న వారితో కన్నీళ్లు పెట్టించింది.

Next Story