మార్కెట్లోకి బిస్కెట్ బాబా.. ఆయనకు అభిషేకించిన బిస్కెట్ల రసమే ప్రసాదంగా.. ఛీ ఛీ

by Naga Rani Yarlagadda |

భక్తికి, మూఢనమ్మకానికి మధ్య ఉన్న గీత చెరిగిపోతుంది అనుకోవడం మన అవివేకమవుతుంది. దైవాన్ని నమ్మే భక్తులే.. ఫేక్ బాబాల మాయలో పడుతున్నారు.

మార్కెట్లోకి బిస్కెట్ బాబా.. ఆయనకు అభిషేకించిన బిస్కెట్ల రసమే ప్రసాదంగా.. ఛీ ఛీ
X

దిశ, వెబ్‌డెస్క్: భక్తికి, మూఢనమ్మకానికి మధ్య ఉన్న గీత చెరిగిపోతుంది అనుకోవడం మన అవివేకమవుతుంది. దైవాన్ని నమ్మే భక్తులే.. ఫేక్ బాబాల మాయలో పడుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో అనేకమంది ఫేక్ బాబాలు వెలిశారు. తాజాగా ఓ బిస్కెట్ బాబా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘బిస్కెట్ బాబా’గా పిలవబడుతున్న ఒక వ్యక్తి చేస్తున్న విన్యాసాలు, దానికి భక్తులు చూపిస్తున్న ఆదరణ చూసి సామాన్యులు విస్తుపోతున్నారు.

వందల కేజీల బిస్కెట్లతో అభిషేకం!

ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ బిస్కెట్ బాబాకు అభిషేకం చేసేందుకు ప్రతిరోజూ సుమారు 100 కేజీల బిస్కెట్లను నీటిలో నానబెట్టి, ఆ ద్రవాన్ని సిద్ధం చేస్తారు. అనంతరం సదరు బాబా గారు ఒక పీఠంపై కూర్చోగా, శిష్యులు ఆ బిస్కెట్ రసాన్ని ఆయన తలపై నుంచి కుమ్మరిస్తూ అభిషేకం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఏదో పవిత్ర కార్యకమంలా జరుగుతుండటం గమనార్హం. ఇక్కడి వరకు ఒక ఎత్తైతే, ఆ తర్వాత జరిగేది మరీ విచిత్రం. బాబా గారి శరీరంపై నుంచి కారుతున్న ఆ బిస్కెట్ ద్రవాన్ని (అభిషేక రసం), ఆయన స్వయంగా తన చేతులతో పట్టుకుని కింద వేచి చూస్తున్న భక్తులకు ‘ప్రసాదం’గా అందజేస్తారు. భక్తులు సైతం ఏమాత్రం సంకోచించకుండా, భక్తి పారవశ్యంతో ఆ ద్రవాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సేవించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చదువుతుంటేనే వికారంగా ఉన్నా.. నిజంగా జరుగుతున్నది ఇదే.

ఈ వీడియోలు చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇది భక్తి కాదు, పక్కా మూఢనమ్మకం అని కొందరు కొట్టిపారేస్తున్నారు. భక్తి ఉండొచ్చు కానీ.. ఇలాంటి పిచ్చి ఉండకూడదంటూ ఫైరవుతున్నారు. ఫేక్ బాబాలను నమ్మేవారు ఉన్నంతకాలం ఇలాంటి వారు పుట్టకొకరు చెట్టుకొకరు పుట్టుకొస్తారని కామెంట్ చేస్తున్నారు. టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా ఇలాంటి అశాస్త్రీయమైన పద్ధతులను అనుసరించడం పట్ల విద్యావంతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. భక్తి అనేది అంతరంగ శుద్ధికి ఉండాలి తప్ప, ఇలాంటి అసహ్యకరమైన వేషధారణలకు కాదని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. రకరకాల పేర్లతో మార్కెట్లోకి వచ్చే వీళ్లను అరెస్ట్ చేసి, జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆరోగ్య నిపుణులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి శరీరంపై నుంచి కారిన ద్రవాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా.. వీడియో ప్రకారం చూస్తే ఈ బాబా ఉన్నది తమిళనాడులో అని తెలుస్తోంది.

Next Story