ఆఫ్రికా అమ్మాయిల అద్భుత ఆవిష్కరణ.. మూత్రంతో ఇంధనం తయారు

by Yella Dhawani Reddy |

వారి వయసు 14, 15 ఏళ్లు. కానీ, వినూత్న ఆవిష్కరణతో ప్రపంచాన్నే ఆశ్చర్యలో ముంచెత్తారు.

ఆఫ్రికా అమ్మాయిల అద్భుత ఆవిష్కరణ.. మూత్రంతో ఇంధనం తయారు
X

దిశ, వెబ్ డెస్క్: వారి వయసు 14, 15 ఏళ్లు. కానీ, వినూత్న ఆవిష్కరణతో ప్రపంచాన్నే ఆశ్చర్యలో ముంచెత్తారు. మానవ మూత్రంతో ఇంధనం తయారు చేసి అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ ప్రాజెక్టును 2012లో నైజీరియాలోని (Nigeria) లాగోస్‌లో జరిగిన 'మేకర్ ఫెయిర్ ఆఫ్రికా' అనే టెక్నాలజీ ప్రదర్శనలో మొదటిసారి ప్రదర్శించారు. అయితే తాజాగా మరోసారి ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఆఫ్రికా (Africa) ఖండంలోని నైజీరియాకు చెందిన 14 ఏళ్ల డ్యూరో-ఐనా అడెబోలా (Duro-Aina Adebola), అకిందేలే అబియోలా (Akindele Abiola), ఫాలెకే ఒలువాటోయిన్ (Faleke Oluwatoyin) అలాగే 15 ఏళ్ల బెల్లో ఎనియోలా (Bello Eniola) అనే నలుగురు విద్యార్థినులు తమ ఉపాధ్యాయుల సాయంతో ఓ వినూత్న జనరేటర్‌ను సృష్టించారు. 'ప్రతి వ్యర్థంలోనూ ఒక వనరు దాగి ఉంది' అనే సూత్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ జనరేటర్ మూత్రాన్ని హైడ్రోజన్ గ్యాస్‌గా మార్చి, దానిని ఇంధనంగా ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు, ఇందులో ఆశ్చర్యకర విషయం మరొకటి ఏమిటంటే.. కేవలం ఒక లీటరు మూత్రంతో ఈ జనరేటర్ ఆరు గంటల పాటు విద్యుత్‌ను అందిస్తుంది.

ఇక ఇదేలా పనిచేస్తుందంటే.. మూత్రాన్ని విద్యుద్విశ్లేషణ (ఎలక్ట్రోలైసిస్) యూనిట్‌లో వేసి హైడ్రోజన్‌ను వేరు చేస్తారు. ఆ తర్వాత హైడ్రోజన్‌ను శుద్ధి చేసి గ్యాస్‌గా మార్చి, దానిని సిలిండర్‌లో నిల్వ చేస్తారు. ఆ హైడ్రోజన్‌ను జనరేటర్‌లో ఉపయోగించి విద్యుత్‌ను సృష్టిస్తారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సమస్యలను పరిష్కరించటంలో ఎంతగానో తోడ్పడుతుంది.

అయితే, ఈ సాంకేతికతను వాణిజ్యపరంగా విస్తరించడానికి ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వార్త, ఆఫ్రికా యువత శక్తిని, ఆవిష్కరణల సామర్థ్యాన్ని చాటి చెబుతోంది. చిన్న వయసులోనే అద్భుతం సృష్టించిన ఈ అమ్మాయిలు రాబోయే యువ క్రియేటర్లకు స్పూర్తిగా నిలువనున్నారు.

Next Story