పెట్రోల్ కష్టాల్లో కొండంత అండ.. 5వేల బైకులకు లీటర్ పెట్రోల్ ఫ్రీ

by Kema Shiva Kumar |

ఏపీలో పెట్రోల్ కొరత నేపథ్యంలో ఓ బంక్ యజమాని 5 వేల ద్విచక్ర వాహనాలకు లీటర్ పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేశారు.

పెట్రోల్ కష్టాల్లో కొండంత అండ.. 5వేల బైకులకు లీటర్ పెట్రోల్ ఫ్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) కొరత తలెత్తుందనే వార్తలు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పలు చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తుండటంతో జనం బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ కష్టకాలంలో తిరుపతి (Tirupati) రూరల్ పరిధిలో ఓ పెట్రోల్ బంక్ యాజమాని చేసిన పని అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా, ప్రశంసలు కురిపిస్తోంది. తిరుపతి రూరల్ పరిధిలోని తనపల్లి వద్ద ఉన్న IOCL పెట్రోల్ బంక్ యాజమాని రొమ్మల రాజేశ్ రెడ్డి (Rommala Rajesh Reddy), పెట్రోల్ కొరత వల్ల ఇబ్బంది పడుతున్న సామాన్యులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనదారులకు (Bikes) ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

5 వేల వాహనాలకు లీటర్ చొప్పున..

ఉచిత పెట్రోల్ వార్త ఆ నోట ఈ నోట పాకడంతో తనపల్లి బంక్‌కు వాహనదారులు భారీగా క్యూ కట్టారు. బంక్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు 5000 ద్విచక్ర వాహనాలకు లీటర్ చొప్పున పెట్రోల్ ఉచితంగా అందజేశారు. ఏపీలో పెట్రోల్ కొరత వార్తల నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్న వారికి భరోసా ఇచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు రాజేశ్ రెడ్డి తెలిపారు. సాధారణంగా పెట్రోల్ కొరత ఉన్నప్పుడు ధరలు పెంచడం లేదా బ్లాక్ మార్కెట్ చేయడం చూస్తుంటాం. కానీ, రాజేశ్ రెడ్డి మాత్రం తన లాభం చూసుకోకుండా తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. తిరుపతి పరిధిలో కొరత ఉన్నందున, తన వంతుగా సాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నానని రాజేశ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Next Story