గొర్రె పేగుతో తయారైన 200 ఏళ్ల క్రితం కండోమ్.. ఎగబడుతున్న జనం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-10 05:46:55  IST  )

నెదర్లాండ్స్‌లోని ప్రముఖ రిజ్క్స్‌మ్యూజియంలో ఓ ప్రత్యేకమైన కళాఖండం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గొర్రె పేగుతో తయారైన 200 ఏళ్ల క్రితం కండోమ్.. ఎగబడుతున్న జనం
X

దిశ, వెబ్ డెస్క్: ఓ మ్యూజియంలో కండోమ్‌ను (Condom) ప్రదర్శనకు ఉంచారు. దాన్ని చూసేందుకు జనాలు ఎగబడి మరీ వెళ్తున్నారు. వింతగా.. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! నెదర్లాండ్స్‌లోని (Netherlands) ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న ప్రముఖ రిజ్క్స్‌ మ్యూజియంలో (Rijksmuseum) దాదాపు 200 సంవత్సరాల పాతదైన, గొర్రె అపెండిక్స్‌తో తయారైన ఓ పురాతన కండోమ్‌ను పర్యాటకుల సందర్శనకు ఉంచారు. 1830లో తయారైన ఈ కండోమ్ 19వ శతాబ్దపు లైంగిక జీవితం, వ్యభిచారం, ప్రజల ఆచార వ్యవహారాలపై దృష్టిపెట్టే ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా మ్యూజియంలో చోటు దక్కించుకుంది.

ఈ అరుదైన కండోమ్ గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. దానిపై ప్రత్యేకమైన పెయింటింగ్ ముద్రించి ఉంది. ఇందులో ముగ్గురు మతాధికారులు, ఒక నన్‌ ఉన్నారు. ఈ కండోమ్‌పై చిత్రం గ్రీకు పురాణం నుంచి ప్రేరణ పొందిందని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. ఇక ప్రదర్శనలో భాగంగా ఈ కండోమ్ మ్యూజియం 'వోయిలా మోన్ చోయిక్స్' అనే శీర్షికతో సందర్శకులను ఆకర్షిస్తోంది. ఫ్రెంచ్‌లో 'ఇది నా ఎంపిక' అని అర్థం. బ్రహ్మచర్యం, గ్రీకు పురాణ గాథల నుంచి పారిస్ తీర్పు వరకూ అన్ని సంగతులనూ కలుపుకుంటూ రూపొందించిన ఈ ప్రదర్శన ఒక వింత విశ్లేషణగా నిలుస్తోంది. అంతేకాదు ఈ మ్యూజియం కళా సేకరణలో ఉంచిన తొలి గర్భనిరోధక సాధకం ఇదేనట.

గత ఏడాది నెదర్లాండ్స్‌లోని హార్లెమ్‌లో జరిగిన వేలంలో మ్యూజిమ్ అధికారులు ఈ కండోమ్‌ను 1,000 యూరోలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అత్యాధునిక UV లైట్ టెస్టింగ్ ద్వారా దీన్ని ఎవరూ ఉపయోగించలేదని నిర్ధారించారు. మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ తెలిపిన వివరాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. 'ప్రింటెడ్ కండోమ్ ఉన్న ఏకైక ఆర్ట్ మ్యూజియం మా వద్ద ఉందని చెప్పుకోవడానికి మేం గర్విస్తున్నాం. అయితే, ఈ వస్తువును తొలిసారిగా వేలంలో చూసినప్పుడు, నేను, నా సహచరుడు నవ్వుకున్నాం. కానీ దీని చారిత్రక ప్రాధాన్యం గుర్తొచ్చిన తర్వాత ఇప్పటిదాకా వచ్చిన ప్రతిస్పందన అద్భుతంగా ఉంది. యువత, వృద్ధులు అందరూ ఆసక్తితో వీక్షిస్తున్నారు. దీనిని ఇతర మ్యూజియంలకు అప్పుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం' అని అన్నారు. ఇక 2025 నవంబర్ చివరి వరకు మ్యూజియంలో ప్రదర్శించబడనుంది. కాగా, ఈ డచ్ మ్యూజియంలో 7.5 లక్షల ఆసక్తికరమైన ఫోటోలు, డ్రాయింగ్లు, ప్రింట్లు ప్రదర్శనకు ఉన్నాయి.

Next Story