వరంగల్‌లో వణుకుతున్న జనం

by  |
వరంగల్‌లో వణుకుతున్న జనం
X

దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు గజగజ వణికిపోతున్నది. కొంతమంది కారణంగా ఇప్పుడు అందరూ ఆందోళన చెందుతున్నారు. మరోపక్క రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టారు. అదేమిటో మీరే చూడండి..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఇటీవలే అక్కడ జరిగిన సభలకు జిల్లా నుంచి 52 మంది వెళ్లి రావడం, అందులో కొంతమందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వారందరినీ గుర్తించిన అధికారులు క్వారంటైన్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో సగం మందికి పైగా నెగెటివ్ రిపోర్ట్ లు రావడంతో కొంత ఊరటనిచ్చినట్లయింది.

కరోనా అనుమానితులుగా భావిస్తున్నవారు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ఎక్కడికి వెళ్లారు..? ఎవరెవరిని కలిశారు..? ఎంతమందిని కలిశారు.. అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న క్రమంలో ఢిల్లీ ఘటన నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజే 15 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ వ్యక్తి కరోనాతో మరణించడం, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు అతడితో సంచరించినట్లు గుర్తించడం, అధికారులు వారిని క్వారంటైన్ కు తరలించడం చకచకా జరిగిపోయాయి. అంతేగాకుండా వారు ఎక్కడెక్కడా సంచారించారనే సమాచారం మేరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మర్కజ్‌కు వెళ్లినవారిలో జనగామ జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. అందులో నర్మెట మండలం వెల్దండకు చెందిన ఖాజా మటన్ విక్రయిస్తుంటాడు. అతడు గ్రామానికి వచ్చిన తర్వాత రెండుసార్లు మాంసాన్ని విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అతడి వద్ద సుమారు 35 మంది మాంసం కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు, వారికి సైతం పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా స్థానిక పోలీసులు వెల్దండ గ్రామంలోకి ఇతరులెవరూ రాకుండా గ్రామస్తులు బయటకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

నిబంధనలు కఠినం

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో మరింత పకడ్బందీగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప గడప దాటి రావొద్దని చెబుతున్నప్పటికీ కావాలని బయటకు వస్తున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేలా చర్యలు చేపట్టారు. చీటికిమాటికీ రోడ్లపైకి వచ్చే వారికి పోలీసులు దండం పెట్టి చెబుతున్నారు. వినకుంటే దండన విధిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని వర్గాల్లో మార్పులు రావడం లేదు. ఈ నేపథ్యంలో నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసేందుకు చర్యలు చేపట్టారు, ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే వారిపై కేసులు నమోదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags : corona , warangal, officer, police, cases


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed