కరోనా కాలం.. కోచింగ్ ఇనిస్టిట్యూట్స్‌కు మోయలేని భారం

by  |
ins 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థులు, నిరుద్యోగులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన ఇనిస్టిట్యూట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో వేల కొద్దీ సంస్థలు మూసుకుపోయాయి. కరోనా మొదటి దశ విజృంభణ అనంతరం లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. అయితే కొద్దిరోజుల్లోనే పరిస్థితులన్నీ చక్కబడుతాయని అనుకున్నారు. అలాగే తమ ఇనిస్టిట్యూట్ నిర్వహణను కొనసాగించారు. అలా రోజులు పోయి నెలలు గడిచే కొద్దీ అద్దె, నిర్వహణ భారం పెరిగిపోయింది. ఆ ఇబ్బందులు తట్టుకోలేక మైత్రివనంలోని హెచ్ఎండీఏకు చెందిన బిల్డింగులో అద్దెకు తీసుకున్న పలు ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు దాదాపు గతేడాది జూన్ నుంచి అద్దె కూడా చెల్లించని పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు కూడా యూ ట్యూబ్ లో లభించే ఉచిత ఆన్ లైన్ కంటెంట్ నే ఫాలో అవుతుండటంతో పలు సంస్థలకు ఆదరణ కరువైంది. పేరున్న సంస్థలు మినహాయిస్తే చిన్న చిన్న సంస్థలన్నీ దాదాపు కనుమరుగైపోయాయి. కరోనా నేపథ్యంలో సగానికి పైగా సిబ్బందిపై వేటు పడింది.

వేలకు పైగా సంస్థలు..

ఒకప్పుడు ఐఐటీ, ఐఏఎస్, నీట్, సాఫ్ట్ వేర్ కోర్సులు, ఇతర కోచింగ్ సెంటర్లు వెలుగు వెలిగాయి. ఎంతో మందిని ఇంజినీర్లను, డాక్టర్లను, ఐఐటీ స్టూడెంట్స్ ను తీర్చిదిద్దిన సంస్థలు కరోనా, లాక్ డౌన్ కారణంగా మూతపడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పలు ప్రాంతాల్లో వేలకు పైగా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా అమీర్ పేట, విద్యానగర్, దిల్ సుఖ్ నగర్, నారాయన్ గూడ తదితర ప్రాంతాల్లో ఇనిస్టిట్యూట్లు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ హైదరాబాద్ లో మినీ అమెరికాగా గుర్తింపు పొందిన అమీర్ పేటలోనే వెయ్యికి పైగా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి. వేలల్లో విద్యార్థులు ఈ ఇనిస్టిట్యూట్ల ద్వారా కోచింగ్ తీసుకున్నారు. ఎందరో ప్రయోజకులయ్యారు. కరోనా వచ్చి అంతా సీన్ రివర్స్ అయింది. అప్పటివరకు ఎంతో ఆదరణ, పేరు ప్రఖ్యాతలు గాంచిన పలు సంస్థలే మూసివేతకు గురికావాల్సి వచ్చింది. ఇక చిన్న సంస్థల పరిస్థితి అయితే వేరే చెప్పనవసరం లేవు. అద్దె చెల్లించలేక నానా కష్టాలు పడి నష్టాలు చవిచూడాల్సి వచ్చి మూతపడ్డాయి.

భారీగా అద్దెలు..

ఇనిస్టిట్యూట్లు నిర్వహించే సంస్థలన్నీ భారీగా బిజినెస్ జరిగే ప్రాంతాల్లో ఉండటంతో కమర్షియల్ బిల్డింగుల్లోనే అద్దెకు తీసుకోవాల్సి పరిస్థితి వచ్చింది. దీని ద్వారా విద్యార్థుల రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుందని భావించి నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం వారికి కరోనా రూపంలో భారీ మూల్యం చెల్లించేలా చేసింది. కరోనాకు ముందు పరిస్థితులన్నీ బాగున్న సమయంలో అద్దె విషయాల్లో ఎలాంటి రాజీ లేకుండా ఇనిస్టిట్యూట్లు కొనసాగాయి. అయితే కరోనా నుంచి ఆ పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఆ భవనాల అద్దె కనీసం రూ.30వేల నుంచి మొదలు పెడితే స్పేస్ ను బట్టి రూ.లక్షకు పైగా నిర్వాహకులు అద్దె చెల్లించేవారు. గతంలో తరగతులు ఆఫ్ లైన్ లో కొనసాగాయి కాబట్టి అదనంగా మరికొన్ని గదులు అద్దెకు తీసుకొని నిర్వహించారు. అప్పుడు ఇనిస్టిట్యూట్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఎక్కువ కాబట్టి అద్దెకు ఎలాంటి ఢోకా రాలేదు. అయితే కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో విద్యార్థులంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. తరగతులు ఆఫ్ లైన్ లో నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆన్ లైన్ దిశగా నిర్వాహకులు అడుగులేశారు. అప్పటి నుంచి నిర్వాహకులకు అద్దె భారమై అవసరం లేని గదులను ఖాళీ చేసి స్టాఫ్ సంబంధిత కార్యాలయాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నారు.

హెచ్ఎండీఏ పరిధిలోని బ్లాకులు ఖాళీ

మైత్రివనంలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పలు బిల్డింగ్ బ్లాకుల్లో దాదాపు ఇనిస్టిట్యూట్లు మూతపడ్డాయి. ఇందుకు కారణం భారీగా ఉన్న అద్దెలే అని నిర్వాహకులు చెబుతున్నారు. చిన్నగదికి కూడా రూ.30 వేలకు పైగానే అద్దె ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాదికి 5 శాతం చొప్పున అద్దె పెంచుతారు. గతంలో అన్నీ బాగానే ఉన్న సమయంలో భారీగానే ఆదాయం రావడంతో నిర్వాహకులు కూడా మిన్నకుండిపోయారు. అయితే లాక్ డౌన్ నుంచి ఇనిస్టిట్యూట్లు లేకపోవడంతో అద్దె చెల్లించడం నిర్వాహకులకు భారమైంది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పలు బ్లాకులు దాదాపు ఖాళీ అయ్యాయి. నిర్వాహకులకు అద్దె భారమై గతేడాది జూన్ నుంచి అద్దె చెల్లించడంలేదు. తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ ను కోరగా పరిశీలిస్తామని చెప్పినట్లుగా వారు వాపోయారు. అలాగే 4 నుంచి 6 నెలల అద్దె కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్లుగా చెప్పినా నేటికీ చేపట్టలేదంటున్నారు ఇనిస్టిట్యూట్ల యాజమాన్యాలు.

అద్దె తగ్గించాలని డిమాండ్లు

ప్రైవేట్ వ్యక్తులకు చెందిన బిల్డింగుల్లో కొనసాగుతున్న ఇనిస్టిట్యూట్ల అద్దెను తగ్గించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా నష్టాల్లో కూరుకుపోయామని తమ గోడును వెలిబుచ్చారు నిర్వాహకులు. ఈ విషయాన్ని యజమానులు అర్థం చేసుకొని కొన్ని నెలలు మాఫీ చేయాలని చెప్పినా వినడంలేదని ఆవేదన చెందుతున్నారు ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు. అద్దె చెల్లించనప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నట్లు వారు వాపోయారు. అడ్వాన్స్ రూపంలో ఇచ్చిన కొంత నగదు, చెక్కు యజమానుల చేతిలో ఉండటం తాము ఏమీ చేయలేకుండా అప్పు తెచ్చి అద్దె చెల్లిస్తున్నట్లు ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకొని తమను ఆర్థిక భారం నుంచి కొంత తప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సగానికి పైగా ఉద్యోగుల కోత

లాక్ డౌన్ కారణంగా సగానికి పైగా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు మూతపడటంతో అందులో పనిచేసే ఉద్యోగులు జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇదిలా ఉండగా మిగిలిన పలు సంస్థల్లో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సగానికి పైగా సిబ్బందిపై వేటు వేశారు నిర్వాహకులు. దీంతో వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కోచింగ్ సెంటర్లలో ఉన్న కొద్దిమందికి కూడా పలు సంస్థలు వేతనాల్లో కోత విధించింది. దీంతో చాలీచాలని జీవితాలతో కుటుంబ పోషణ సాగించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఆన్ లైన్ కు తగ్గిన ప్రియారిటీ

ప్రభుత్వ నోటిఫికేషన్లు లేక, సాఫ్ట్ వేర్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులెవరూ కోచింగ్ తీసుకునేందుకు ఆసక్తి కనబరచడంలేదు. కరోనాకు ముందు నోటిఫికేషన్లు వస్తాయని కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు. కానీ కొవిడ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, నోటిఫికేషన్లు లేకపోవడంతో ఆన్ లైన్ తరగతులకు కూడా ప్రియారిటీ తగ్గిపోయింది. దీనివల్ల కూడా నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా పలు సంస్థల్లో కోచింగ్ కు సంబంధించిన ఫీజుల్లో వ్యత్యాసం కూడా ఎంతో ఉంది. కొన్ని సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఫీజుల రేట్లు భారీగా పెంచాయి. ఆన్ లైన్ లో వీడియో లు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండటంతో ధరలు పెంచేశారు నిర్వాహకులు. దీనివల్ల పలు పెద్ద ఇనిస్టిట్యూట్లకు లబ్ధి చేకూరితే చిన్న సంస్థల పాలిట శాపంగా మారింది. యూట్యూబ్ లో ఆన్ లైన్ క్లాసులు ఉచితంగా లభ్యమవుతుంటే తమకు ఆదరణ కూడా లేకుండా పోయి బతుకులు భారంగా మారాయని అంటున్నారు.

ఆన్ లైన్ తరగతులకు ఆదరణ తగ్గింది

ఆఫ్ లైన్ లో నిర్వహించే తరగతుల కన్నా ఆన్ లైన్ లో నిర్వహించే తరగతులకు ఆదరణ తగ్గింది. ఫ్యాకల్టీని బట్టి ఆన్ లైన్ తరగతులకు విద్యార్థులు హాజరవుతున్నారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో ఫ్యాకల్టీని ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల ఇనిస్టిట్యూట్ల మనుగడ కష్టంగా మారింది. అద్దె చెల్లించలేక ఆర్థికంగా సతమతమవుతున్నాయి. ఆఫ్ లైన్ సమయంలో బిల్డింగులోని పలు బ్లాకులను అద్దెకు తీసుకున్నాం. ఆన్ లైన్ వల్ల అద్దె భారం భరించలేక ఖాళీ చేశాం. ఒకవేళ మళ్లీ ఇనిస్టిట్యూట్లు తిరగి ప్రారంభిస్తే ఆ గదులను యజమానులు వేరే వారికి అద్దెకు ఇచ్చేస్తారు. తమకు గదులు దొరకడం కష్టమవుతుంది. అలాగని అలాగే ఉంచుదామంటే అద్దె ఎక్కువగా ఉన్నాయి. కాస్త తగ్గిస్తే బాగుంటుంది.

ins

= సాహితి, దుర్గ సాఫ్ట్ ఇనిస్టిట్యూట్ కౌన్సిలర్.

అద్దెలు తగ్గించాలి..

యజమానులు అద్దెలు తగ్గిస్తే కాస్త ఉపశమనం దొరుకుతుంది. మేము కూడా విద్యార్థులు, నిరుద్యోగుల కష్టాలు అర్థం చేసుకుని ఫీజులు పెంచకుండా ఆన్ లైన లో తరగతులు నిర్వహిస్తున్నాం. కరోనాకు ముందు ఉన్న ఫీజులే నేటికీ కొనసాగిస్తున్నాం. కొన్ని సంస్థలు మాత్రం వీడియోల ద్వారా క్లాసులు వినేందుకు జీవితకాలం వరకు యాక్సెస్ ఇస్తున్నామని వారికి ఇష్టం వచ్చినట్లుగా పెంచేశాయి. కరోనా కారణంగా చాలా వరకు ఇనిస్టిట్యూట్లు ఆర్థికంగా నష్టపోయి మూతపడ్డాయి.

= జూమ్ టెక్నాలజీస్ నిర్వాహకుడు, మైత్రివనం

Next Story

Most Viewed