మన దగ్గర ట్రాఫిక్ సమస్య తగ్గింది : హోం మంత్రి

by  |
మన దగ్గర ట్రాఫిక్ సమస్య తగ్గింది : హోం మంత్రి
X

దిశ, క్రైమ్ బ్యూరో: దేశ వ్యాప్తంగా పలు మెట్రో నగరాలతో పోల్చితే.. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా వరకూ తగ్గినట్టు హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు నగరాల కంటే హైదరాబాద్‌లో వాహనాల సగటు వేగం పెరిగిందన్నారు. నేషనల్ రోడ్డు సేఫ్టీ మంత్ ఉత్సవాలను నగర సీపీ అంజనీ కుమార్‌తో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీ-20 ట్రాఫిక్ అవేర్‌నెస్ టెస్టింగ్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. హోం మంత్రి మాట్లాడుతూ.. ట్రాఫిక్ పోలీసులు డబ్బులు కోసమే చలాన్లు వేస్తున్నారంటూ వచ్చే విమర్శలు, ఆరోపణలు సరైంది కాదన్నారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో సరైన అవగాహన కోసమే ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నట్టు తెలిపారు.

ముఖ్యంగా ప్రతి వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ… నగర పౌరులు చట్టాన్ని గౌరవించేలా, చట్టంలోని ప్రతి అంశాలను అనుసరించాలని అన్నారు. ట్రాఫిక్ సబ్జెక్ట్ నూటికి నూరు శాతం ప్రజలు అందరికీ సంబంధించిన సబ్జెక్ట్ అన్నారు. గత రెండు, మూడేండ్లుగా రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గతేడాది (2020)లో రాష్ట్ర వ్యాప్తంగా 6231 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారని తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 254, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 692, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 562 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించినట్టు వివరించారు.


Next Story

Most Viewed