కాంగ్రెస్​ నేతల నోళ్లకు తాళాలు!

by  |
కాంగ్రెస్​ నేతల నోళ్లకు తాళాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్​ శ్రేణులు ఎలాంటి అంశాలపై కూడా మాట్లాడటం లేదు. ఎటూ తెగని టీపీసీసీ అంశం పార్టీ నేతల నోళ్లకు తాళాలు వేసింది. దాదాపు 40 రోజుల పాటు రేపు, మాపు అంటూ సాగిన టీపీసీసీ చీఫ్​ ఎన్నిక మరోసారి దూరమైంది. మళ్లీ ఉత్తమ్​కే పగ్గాలు అప్పగించారు. ఈ పరిణామాలు ఎలా ఉన్నా ప్రస్తుతం పార్టీ నుంచి కనీసం కేంద్ర కొత్త చట్టాలపై మాట్లాడే నేతలు కూడా లేకుండా పోయారు. రాష్ట్రంలో పరిస్థితులపై గళమెత్తే ఎంపీ రేవంత్​రెడ్డి, ఇతర నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. టీపీసీసీ చీఫ్​ ఎంపిక వాయిదా పడినప్పటి నుంచి మీడియాకు కూడా ముఖం చూపించడం లేదు. దీంతో పార్టీ నేతల్లో కూడా నైరాశ్యం నెలకొంది.

అటు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కూడా అదే పరిస్థితి. తన సొదరుడి వ్యవహారమే తనుక తలనొప్పిగా మారింది. సొదరుడినే సముదాయించుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని ఎలా నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. అటు రాజగోపాల్​రెడ్డి కూడా విమర్శలు ఆపలేదు. బీజేపీలోకి వెళ్తామని, కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో లేదని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రాష్ట్ర రాజకీయాలు ఎలా తెలుస్తాయంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ తరుఫున అప్పుడో, ఇప్పుడో ప్రకటనలు చేసే వీహెచ్​, వంశీచంద్​రెడ్డి, శ్రవణ్​, మధుయాష్కి, నిరంజన్​, కుసుమ కుమార్, మల్లు రవి​తో పాటు మిగతా నేతలందరూ ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. నిజామాబాద్​ జిల్లాలో షబ్బీర్​ అలీకి సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఆయన కూడా గాంధీ భవన్ వైపే రావడం మానేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్​బాబు, జగ్గారెడ్డి కూడా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు.

రచ్చగా ‘టీపీసీసీ’ అంశం

టీపీసీసీ కొత్త అధ్యక్షుడి అంశం పార్టీలో రచ్చగా మారింది. రేవంత్​రెడ్డికి ఇస్తారనే ప్రచారంతో సీనియర్లు బహిరంగంగానే ఎదురుదాడి చేశారు. సోనియాకు లేఖలు పంపారు. ఈ పరిణామాల్లో వెంకట్​రెడ్డి పేరు ప్రాధాన్యతకు వచ్చింది. అయితే అనూహ్యంగా ఎమ్మెల్సీ జీవన్​రెడ్డికి ఖరారు అయిందని, త్వరలోనే ప్రకటిస్తారని ఈ నెల ప్రారంభంలోనే ప్రచారమైంది. అధిష్ఠానం నుంచి కూడా క్లియరెన్స్​ వచ్చిందంటూ చెప్పుకున్నారు. కానీ కేవలం జానారెడ్డి కోరిక మేరకు సాగర్​ ఉప ఎన్నిక వరకు వాయిదా వేశారని మళ్లీ చెప్పుతున్నారు. దీనిపై రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్​ కూడా ఢిల్లీ నుంచి ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ అంశం ద్వారా రాష్ట్ర నేతల్లోని విభేదాలు బయటకు వచ్చాయి. అసలు కాంగ్రెస్​ పార్టీ నేతలు కలిసి ఉండడమంటూ కలేననే పరిస్థితులు నెలకొన్నాయి.

‘ఎమ్మెల్సీ’ పరిస్థితేంటో?

మరోవైపు రాష్ట్రంలో జరుగబోయే పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో మాణిక్కం ఠాగూర్​ పరిశీలన చేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. దీనికి కూడా పలువురు నేతల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం. హైదరాబాద్​, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ స్థానానికి మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే రేసులో ఇప్పటికే వంశీచంద్​రెడ్డితో పాటు పలువురు నేతలున్నారు. అదేవిధంగా వరంగల్​, ఖమ్మం, నల్గొండ పట్టబద్రుల స్థానం నుంచి రాములు నాయక్​ను పోటీకి దింపుతారని భావిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​, విద్యార్థి నాయకుడు మానవతారాయ్​ పలువురు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలతో కాంగ్రెస్‌ పార్టీలోలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని పలువురు చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed