ఉద్యోగాలా.. పింఛన్లా మీరే తేల్చుకోండి : రేవంత్ రెడ్డి

by  |
ఉద్యోగాలా.. పింఛన్లా మీరే తేల్చుకోండి : రేవంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : మీ కొడుకుల‌కు రూ.40 వేల‌ వేతనంతో కూడిన ఉద్యోగాలు కావాల్నా… కేసీఆర్ ఇచ్చే రూ.2 వేలు పింఛన్లు కావాల్నా.. తేల్చుకోవాలని హుజ‌రాబాద్ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. ఉపఎన్నికలో ఆలోచించుకుని మరీ ఓటు వేయాలన్నారు. రాష్ట్ర సంప‌ద‌ను దోచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌నిచేస్తున్నార‌న్నారు. రాష్ట్రంలో 1.90 ల‌క్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా.. భ‌ర్తీ చేయకుండా యువ‌త‌కు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మీ ఇంటికి పెద్ద కొడుకు కాదు.. దొంగ కొడుకుగా తయార‌య్యాడంటూ ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం క‌మ‌లాపూర్ బ‌స్టాండ్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన వేదిక నుంచి రేవంత్‌రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేశారు.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈట‌ల రాజేంద‌ర్ ఈ ప్రాంత అభివృద్ధిని ప‌ట్టించుకోలేద‌ని విమర్శించారు. త‌న అవ‌స‌రార్థం కారు దిగిన రాజేంద‌ర్ క‌షాయ కండువా క‌ప్పుకున్నార‌ని, స‌ర‌ుకు అదే.. కేవ‌లం సీసా మాత్రమే మారిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రజ‌ల‌కు అన్యాయం చేస్తూ వ‌స్తున్నాయ‌న్నారు. వస్తువుల ధ‌ర‌లు విప‌రీతంగా పెంచేశారన్నారు. ఉప్పు, ప‌ప్పు, కూర‌గాయ‌లు, గ్యాస్ ఇలా ప్రతీదానిపై ప‌న్నును పెంచుకుంటు పోతున్నాయ‌ని మండిపడ్డారు. పేద కుటుంబాల సొమ్మును లిక్కర్ రూపంలో లాగేసుకుంటున్నాడ‌ని తెలిపారు. రాష్ట్రంలో గ‌ల్లీగ‌ల్లీలో బెల్ట్‌షాపులు వెలిశాయ‌ని, 12 సంవ‌త్సరాల పిల్లొడు కూడా తాగుబోతులుగా మారుతున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ల‌భించ‌డం లేదని, వేసిన పంట‌ను కొనుగోలు ల‌భిస్తుంద‌న్న న‌మ్మకం రైతుల్లో క‌నిపించ‌డం లేద‌ని వాపోయారు.

వీలైతే అన్ని ఓట్లు.. లేదంటే క‌నీసం ఒక్క ఓటు..

సుధీర్ఘకాలంగా ఎన్‌ఎస్‌యూఐలో ప‌నిచేస్తున్న బ‌ల్మూరి వెంక‌ట్‌కు కాంగ్రెస్ పార్టీ అవ‌కాశం క‌ల్పించింద‌ని, ప్రజ‌లు నిండు మ‌న‌స్సుతో ఆశీర్వదించి గెలిపించాల‌ని రేవంత్ కోరారు. వీలైతే ఇంట్లో ఉన్న అంద‌రూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల‌ని లేదంటే క‌నీసం ఇంటికి ఒక ఓటు వేసి కాంగ్రెస్‌కు మ‌ద్దతుగా నిల‌వాల‌ని కోరారు. అంత‌కుముందు ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థి బ‌ల్మూరి వెంక‌ట్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాక‌ర్, మాజీ మంత్రులు ష‌బ్బీర్ అలీ, గీతారెడ్డి, వ‌రంగ‌ల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేంద‌ర్ రెడ్డి, సీత‌క్కలు మాట్లాడారు. వెంక‌ట్‌ను మంచి మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు.


Next Story