పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు: కేటీఆర్

by Disha Web Desk 11 |
పరిశ్రమల ఏర్పాటుతో  ఉద్యోగ అవకాశాలు:  కేటీఆర్
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: పరిశ్రమల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రమైన కృషి చేస్తోందని మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. అభివృద్ధి చెందిన, చెందకపోయినా దేశమైనా, రాష్ట్రాలైనా ప్రజలందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అంతా సులభం కాదని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులందరికి ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ ఉద్యోగమైన లభించాలనే ఆకాంక్షతో బీఆర్ఎస్​ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఫాక్స్​కాన్​ కంపెనీ ప్రారంభం అనంతరం బీఆర్​ఎస్​ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.


ఫ్యాక్స్​కాన్​ కంపెనీ దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టి కార్యకలపాలు నిర్వహిస్తుంది... కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలు ఏర్పాటు చేయాలనే సంకల్పం ఏ రాష్ట్రంలో కనిపించలేదని ఫాక్స్​కాన్​ కంపెనీ ప్రతినిధి బృందం చెప్పడం తమకు గర్వంగా ఉందని అన్నారు. ఫాక్స్ కాన్ కంపెనీతో మార్చి 2వ తేదీన సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. ఒప్పందం జరిగిన రెండున్నర నెలల తర్వాత ఫాక్స్​కాన్​ కంపెనీ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఉపాధి కల్పన, సంపద సృష్టి అత్యంత సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఈ రెండు అంశాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ విదేశాలకు తిరిగి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.

ఫాక్స్ కాన్ కంపెనీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 35 నుంచి 40 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రానున్న తొమ్మిది నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారన్నారు. స్ధానికులకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు సంబంధించిన కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసే బాధ్యతను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్ధానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డిలకు కేటీఆర్​ అప్పగించారు. రాష్ట్రంలో సంపద సృష్టికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కృషి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయని కేటీఆర్​ అన్నారు.

యువకుల పొట్ట కొట్టి పేపర్లు లీక్ చేసిన ఒక పార్టీ నిరుద్యోగ మార్చ్ అంటుందని పరోక్షంగా బీజేపీని కేటీఆర్​ విమర్శించారు. దశాబ్దాల పాటు అన్ని రంగాల్లో విఫలమైన మరొక పార్టీ ఇప్పుడొక చాన్స్ కావాలని అడుగుతుందని పరోక్షంగా కాంగ్రెస్​ పార్టీపై కేటీఆర్​ ఆరోపణలు చేశారు. మా ప్రభుత్వం అన్ని రంగాలను, అన్ని వర్గాలను కలుపుకొని సంక్షేమమే ఎజెండాగా ముందుకు పోతుందని అన్నారు. జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నదన్నారు. అందరకీ తాగడానికి మంచినీళ్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది బీఆర్​ఎస్​ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మందికి రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్​ఎస్​ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక పథకాలకు తెలంగాణనే స్పూర్తిగా తీసుకుందన్నారు.

నేడు తెలంగాణలోని పట్టణాలు, పల్లెలు బాగున్నాయంటే మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 30 శాతం జాతీయ అవార్డులను గెలుచుకుందని కేటీఆర్​ గొప్పగా చెప్పారు. వ్యవసాయం నుంచి ఐటీ దాకా అన్ని రంగాల్లో అగ్ర పథాన దూసుకుపోతుందని అన్నారు. రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావస్తోందని, దశాబ్దాల పాటు ప్రాజెక్టు కట్టకుండా సతాయించి నీళ్లు ఇవ్వని పార్టీలు, ఉద్యోగాలు ఇవ్వని పార్టీలు ఇవాళ అవకాశం కోసం అడుగుతున్నాయని కాంగ్రెస్​, బీజేపీని పరోక్షంగా కేటీఆర్​ విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు ఇచ్చిన కేసీఆర్ మాత్రమే సాగునీరు కూడా ఇస్తారని స్ధానిక ప్రజలు నమ్ముతున్నారని వివరించారు. వచ్చే నాలుగు సంవత్సరాలలో కొంగరకలాన్, మహేశ్వరం ప్రాంతాలు సమూలమైన మార్పులు వస్తాయని అన్నారు.

రజనీకాంత్ లాంటి వ్యక్తులు హైదరాబాద్ న్యూయార్క్ నగరంలా మారిందని ఊరికే అనలేదని గుర్తు చేశారు. కేంద్రంలో 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి మోడీ మోసం చేసిన తర్వాత కూడా బిజెపి నిరుద్యోగ మార్చ్ పేరుతో తిరుగుతున్నదని ఎద్దేవా చేశారు. బీజేపీ చెప్పినట్లు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు నిరుద్యోగ మార్చ్ అవసరం లేదని అన్నారు. దమ్ముంటే నిరుద్యోగ మార్చ్ మోడీ పైన చేయాలని సలహా ఇచ్చారు. పేపర్లు లీక్ చేసి విద్యార్థి, యువతను ఇబ్బందుల పాలు చేసిన పార్టీ బిజెపి అని అన్నారు. ఈ రోజు ఇన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటే రెండే కారణాలు అని అన్నారు.

ఒకటి సుస్థిరమైన ప్రభుత్వం మరొకటి సమర్థవంతమైన నాయకత్వమని గుర్తు చేశారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాలని బీఆర్​ఎస్​ కార్యకర్తలకు కేటీఆర్​ పిలుపునిచ్చారు. మామూలు విజయంతో కాకుండా ఢంకా బజాయించి సీఎం కేసీఆర్ పాలనకి 100 సీట్లతో ప్రజామోదం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్​ రెడ్డి (బంటీ) తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed