నూడుల్స్ టేస్ట్ చేయండి.. లక్షల జీతం అందుకోండి!

77

దిశ, వెబ్‌డెస్క్: కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని అంటుంటారు. ఇక్కడ కొండలంటే.. ఆస్తులన్న విషయం తెలిసిందే. అయితే, అందుకు భిన్నంగా.. కూర్చుని తింటే లక్షల రూపాయలు అకౌంట్‌లో వచ్చి పడితే.. భలే ఉంటుంది కదా. ఇంతకీ అదెలా సాధ్యమంటారా? అందుకోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా?

లక్షల రూపాయలు జీతంగా ఇస్తున్నారంటే.. రాత్రింబవళ్లు కష్టపడిపోయి, బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించాల్సిన అవసరం లేదు, కొత్త ఆవిష్కరణ చేయాలని చింతించాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ నూడుల్స్ టేస్ట్ చేసి అవి ఎలా ఉన్నాయో చెబితే చాలు.. లక్షల జీతం సొంతమవుతుంది. అమెరికాకు చెందిన నిస్సిన్ సంస్థకు చెందిన ‘టాప్ రామెన్ నూడిల్స్’ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ జాబ్ ఆఫర్‌ను ప్రకటించింది కంపెనీ. నూడుల్స్ చీఫ్ ఆఫీసర్ జాబ్ పొందేందుకు ఎటువంటి డిగ్రీలు అవసరం లేదు. ఈ టాప్ రామెన్ చీఫ్ నూడిల్ ఆఫీసర్ పదవికి ఎంపికైన ఉద్యోగికి 10వేల డాలర్లు (ఇండియా కరెన్సీలో రూ.7 లక్షల 34 వేలు) జీతంతో సహా 50 ఏళ్ల పాటు టాప్ రామెన్ వేరియస్ ప్రొడక్ట్స్‌ను ఆ ఉద్యోగి ఇంటికి ఉచితంగా పంపనున్నట్టు సంస్థ తెలిపింది. అంతేకాదు.. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నిస్సిన్ సీఈవో మైక్ ప్రైస్ స్వయంగా మెంటార్‌షిప్ అందించనున్నాడు.

జాబ్ పొందేందుకు.. రామెన్ నూడుల్స్‌ను తయారుచేసి, దానికి సంబంధించిన ఫొటోలను హౌడూయూటాప్‌రామెన్ (#HowDoYouTopRamen) అనే హ్యాష్‌ట్యాగ్ జతచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని తెలిపింది. దీంతో పాటు ఒరిజనల్ టాప్ రామెన్ ( @OriginalTopRamen), చెఫ్ మెలిస్సా కింగ్ (@ChefMelissaKing) అనే వాటికి ట్యాగ్ చేయాలి. సెలెబ్రిటీ చెఫ్ మెలిస్సా కింగ్ దీనికి జడ్జిగా వ్యవహరిస్తారు. అక్టోబర్ 30 వరకు తమ సబ్‌మిషన్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 106.4 బిలియన్ల రామెన్ నూడుల్స్ అమ్ముడుపోయినట్లు వరల్డ్ ఇన్‌స్టంట్ నూడుల్ ఫౌండేషన్ తెలిపింది.