AP Politics: మోడీ వస్తున్నారు.. పశ్చిమకు మహర్ధశ తెస్తా.. ఎన్డీఏ అభ్యర్థి

by Disha Web Desk 3 |
AP Politics: మోడీ వస్తున్నారు.. పశ్చిమకు మహర్ధశ తెస్తా.. ఎన్డీఏ అభ్యర్థి
X

దిశ, ప్రతినిధి, విజయవాడ: ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 55వ డివిజన్ టీడిపీ అధ్యక్షులు షేక్ జాహెద్ వడ్డాది, రమణ తో కలిసి కంసాలిపేట, తమ్మిన పోతరాజు వీధి, ఎర్రకట్టా, దనేకుల సుబ్బారావు ర్యాంపు, తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా సుజనాకు పలువురు మహిళలు స్థానిక సమస్యలను వివరించారు. ఇరుకు రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలానే ముస్లిం రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంపై సుజనా స్పష్టత ఇచ్చారు. ఓటమి భయంతోనే ముస్లింలను బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముస్లింలకు అండగా ఉండే బాధ్యత తనదని స్పష్టం చేశారు. తాను గత నాయకుల్లా మాటలు చెప్పే వ్యక్తిని కానని, డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి ఎంత చేస్తామో మీరే చూస్తారంటూ ధీమాగా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పని చేసిన తన అనుభవాన్ని నియోజకవర్గం ప్రజల కోసం ఉపయోగిస్తానన్నారు.

మే 3న ప్రధాని మోడీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఈ నియోజకవర్గానికి మహర్దశ పట్టబోతోందని జోస్యం చెప్పారు. ప్రత్యర్థి పార్టీలు తనపై నిందలు వేయడం సహజమని, దిగజారి మాట్లాడేవారి గురించి తాను స్పందించబోనని సుజనా తేల్చి చెప్పారు. చంద్రబాబును బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని పరోక్షంగా కేశినేని నానిపై సెటైర్ వేశారు.

పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదలుగా మిగిలిపోయారని అన్నారు. డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. కూటమిని భారీ మెజారిటీతో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సుజనాకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్‌బెగ్ జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బాడిత శంకర్ కన్నా, రజిని, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed