సోనియాగాంధీ కుటుంబ ట్రస్టులపై దర్యాప్తు

by  |
సోనియాగాంధీ కుటుంబ ట్రస్టులపై దర్యాప్తు
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. చైనా నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్‌జీఎఫ్)కు నిధులు వచ్చాయన్న బీజేపీ ఆరోపణల నేపథ్యంలో ఆ ఫౌండేషన్‌తోపాటు రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లపై దర్యాప్తునకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకోసం అంతర్గత మంత్రిత్వ శాఖలతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక డైరెక్టర్ నేతృత్వం వహిస్తారని తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ), ఫారీన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్‌సీఆర్ఏ), ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ సహా పలు నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు జరుగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. విరాళాల మూలంపైనే, ముఖ్యంగా విదేశీ దాతలకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ ఉంటుందని, అవసరమైతే బాధ్యులు కూడా విచారణకు హాజరు కావలసి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రత్యేక ప్యానెల్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, ఆర్థిక శాఖ, పట్టణ అభివృద్ధి శాఖ, హోంశాఖల నుంచి సభ్యులు ఉంటారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లకు సోనియాగాంధీనే చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం గమనార్హం. రాహుల్ గాంధీ సహా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం సంచలనంగా మారింది.

చైనాతో సరిహద్దు వివాదం తలెత్తిన తరుణంలో బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకన్న సంగతి తెలిసిందే. సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ ప్రశ్నలు కురిపిస్తున్న నేపథ్యంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌పై బీజేపీ ఆరోపణలు సంధించింది. చైనా నుంచి నిధులు పొందిన కాంగ్రెస్‌కు దేశ భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. 2005-06 కాలంలో చైనా, చైనా ఎంబసీ నుంచి ఆర్‌జీఎఫ్‌కు 3లక్షల డాలర్లు వచ్చాయని ఆరోపణలు చేశారు. అదే రోజు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆర్‌జీఎఫ్ దాతల 2005-06 వార్షిక రిపోర్టులో చైనా ఎంబసీ నుంచి నిధులు పొందినట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని, ఈ విరాళాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన డిమాండ్ చేశారు. కాగా, సోనియా గాంధీ కుటుంబానికి చెందిన మూడు ట్రస్టులపై దర్యాప్తు ప్రకటనపై స్పందిస్తూ ఇప్పుడు ఈ విషయం ప్రజల్లోకి వచ్చిందని, వాటిపై దర్యాప్తు జరిపేందుకు నిర్ణయం తీసుకోవడం సహజమేనని బీజేపీ అభిప్రాయపడింది.

ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తాం

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలకు పార్టీ గాని, నేతలు గాని భయపడరని కాంగ్రెస్ తెలిపింది. తమ పార్టీపై బీజేపీ ఎప్పటికప్పుడు విద్వేషాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నదని, అణగారిన వర్గాల పక్షాన బాధ్యత తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని కాంగ్రెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ దాచి పెట్టేదేమీ లేదని, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదని ఆ పార్టీ తెలిపింది. సర్కారు దగ్గర యంత్రాంగం ఉన్నదని, ఏ ప్రశ్నైనా అడగనివ్వమని, ఎలాంటి దర్యాప్తునైనా చేసుకోనివ్వమని పేర్కొంది. అన్నింటికి సమాధానమివ్వడానికి చట్టబద్దంగా వ్యవహరిస్తామని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తెలిపారు. అయితే, ఆర్‌జీఎఫ్‌ను అడిగే ప్రశ్నలే ఆరెస్సెస్ సహా వివేకానంద ఫౌండేషన్, బీజేపీ విదేశీ మిత్రులు, ఇండియా ఫౌండేషన్‌లను కూడా అడగాలని డిమాండ్ చేశారు. చైనా సరిహద్దు వివాదం, కొవిడ్-19, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి పోరాడకుండా కేంద్ర సర్కారు కాంగ్రెస్‌తో పోరుతున్నదని కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ అన్నారు. 2005లో పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్‌జీఎఫ్‌కు చేరిన రూ.20లక్షలు అండమాన్ నికోబర్ దీవుల్లో వచ్చిన సునామీ రిలీఫ్ పనులకే కేటాయించామన్న విషయాన్ని బీజేపీ దాస్తున్నదని కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం ట్వీట్ చేశారు. 15ఏళ్ల క్రితం ఆర్‌జీఎఫ్ పొందిన గ్రాంట్లకు 2020లో భారత భూభాగంలోకి చైనా చొరబాటుకు సంబంధం ఏమైనా ఉన్నదా? అని ప్రశ్నించారు.



Next Story

Most Viewed